గేటెడ్ కమ్యూనిటీలో నివసిస్తున్న వాళ్లకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిబంధనలు రూపొందించాలని హైదరాబాద్ పోలీసులకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కమ్యూనిటీ నివాసాల్లో చేసే పనులు, చేయకూడని పనులు రూపొందించి వాటిని గేటెడ్ కమ్యూనిటీలో ఉండే ఎగ్జిక్యూటివ్ కమిటీలకు అందించాలని ఆదేశించింది.
గేటెడ్ కమ్యూనిటీల్లో కొంత మంది అద్దెకు తీసుకోవడమో.. కొనుగోలు చేయడమో చేసి.. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. పార్టీలు నిర్వహించడం, అసాంఘీక కార్యకలాపాలు, భారీ సౌండ్ తో చుట్టుపక్కల వారిని ఇబ్బంది పెట్టడం వంటివి చేస్తున్నారు. అలాంటి సమస్యలను ఎక్కువగా ఆయా కాలనీ కమిటీలే చూసుకోవాలని పోలీసులు లైట్ తీసుకుంటున్నారు. ఇలా ఓ కమ్యూనిటీలో సమస్యలు వస్తూంటే కొంతమంది కోర్టును ఆశ్రయించారు.
మెరుగైన జీవన శైలి, శాంతి, గౌరవ ప్రదమైన ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి సామరస్యం, మెరుగైన సౌకర్యాలు, వ్యాయామ శాల, క్రీడా సౌకర్యాలు, ఉద్యాన వనాలు, తదితర సౌకర్యాలుంటాయన్న ఉద్దేశంతో ఎక్కువ మంది గేటెడ్ కమ్యూనిటీని ఎంచుకుంటున్నారు. గేటెడ్ కమ్యూనిటీలతో పాటు ఫ్లాట్ అసోసియేషన్లు తెలంగాణ అపార్ట్మెంట్ చట్టం నిబంధనల కింద నడుస్తున్నాయి. గేటెడ్ కమ్యూనిటీలో జరిగే అసాంఘిక, చట్టవిరుద్ధమైన కార్యకలాపాల నియంత్రణకు చర్యలు చేపట్టే అధికారం పోలీసులకు ఉందని న్యాయస్థానం స్పష్టం చేసింది.
గేటెడ్ కమ్యూనిటీల్లో ఫిర్యాదుల స్వీకరణకు అవసరమైతే పోలీస్స్టేషన్ పరిధిలో ప్రత్యేకంగా యాప్ను రూపొందించే అంశాన్ని పరిశీలించాలని పోలీసులకు హైకోర్టు సూచించింది. గేటెడ్ కమ్యూనిటీల్లో నివాసితులు ధనిక వర్గానికి చెందినవారు కావడంతో అధికారులు, పోలీసులపై వారి ప్రభావం ఎక్కువగా ఉంటుందని కోర్టు అభిప్రాయపడింది.