ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలకు వేర్వేరుగా హైకోర్టుల ఏర్పాటుకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. జనవరి 1, 2019 నుంచి రెండు రాష్ట్రాల్లోనూ విడివిడిగా కోర్టులు కార్యకలాపాలు ప్రారంభించనున్నాయి. దీనికి సంబంధించిన జడ్జిల కేటాయింపులు జరిగింది. ఆంధ్రాకు 16 మంది, తెలంగాణకు 10 జడ్జిలను కేటాయిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు విడుదల చేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం అపరిష్కృతంగా ఉంటూ వచ్చిన ప్రధానమైన విభజనల్లో మరొకటి పూర్తయినట్టే. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న హైకోర్టు ఇకపై పూర్తిస్థాయిలో తెలంగాణకు కేటాయించారు. అమరావతిలో నుంచి అక్కడి కోర్టు కార్యకలాపాలు మొదలుపెడుతుంది.
జనవరి 1 నుంచే రెండు రాష్ట్రాల్లోనూ కోర్టులు పనులు ప్రారంభించాల్సి ఉన్నా, పూర్తిస్థాయిలో ఏర్పాట్లన్నీ జరిగి, కుదుటపడేసరికి కొంత సమయం పడుతుందనే అభిప్రాయం న్యాయవాదుల నుంచి వ్యక్తమౌతోంది. అమరావతిలో ఇంకొన్ని ఏర్పాట్లు పూర్తి కావాల్సి ఉందని అంటున్నారు. ఎలాగూ కోర్టుకి జనవరి 6 నుంచి సెలవులున్నాయి. ఆ సెలవుల్ని ఒక వారం ముందుకు జరిపి, అంటే జనవరి 1 నుంచే సెలవులు ప్రకటిస్తే… సంక్రాంతి పండుగ పూర్తయ్యే వరకూ కొంత సమయం దొరుకుతుందనీ, ఈలోగా ఇతర సర్దుబాట్లు అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. హైకోర్టు విభజన తరువాత జరగాల్సిన ప్రక్రియపై జనవరి 1లోగా కొన్ని చర్యలు ఉంటాయనీ అంటున్నారు.
అయితే, న్యాయవాదులకు కొన్నాళ్లపాటు కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే, ప్రస్తుతం దాదాపు 1500 మందికిపైగా లాయర్లున్నారని అంచనా. వీరంతా అమరావతికి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. వీరందరికీ అక్కడ వసతులు ఎలా అనేది ప్రశ్న..? అయితే, వారికి ప్రభుత్వంగానీ, హైకోర్టు అడ్మినిస్ట్రేషన్ గానీ ఏవైనా కొన్ని సౌకర్యాలు కల్పిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రాంతాల కేసులు ఒప్పుకున్న ఆంధ్రా లాయర్లు… ఆంధ్రా ప్రాంతానికి చెందిన కేసులు ఒప్పుకున్న తెలంగాణ లాయర్లూ ఉంటారు కదా! వారు కొన్నాళ్లపాటు రెండు రాష్ట్రాల కోర్టుల మధ్యా తిరగాల్సిన పరిస్థితి ఉంటుందనే చెప్పొచ్చు. నిజానికి, లాయర్లు ఎక్కడ ఉండాలీ అనేది వారి వ్యక్తిగత నిర్ణయమే అవుతుంది. ఉద్యోగుల మాదిరిగా వారిని పంపించాల్సిన పనులేవీ ఉండవు కదా! అయితే, హైకోర్టు విభజన జరిగినప్పుడు మొదట్లో ఇలాంటి చిన్నచిన్న సమస్యలు ఉండటం అనేది సహజమే. ఏదేమైనా, విభజనకు సంబంధించిన మరో ప్రధాన ఘట్టం హైకోర్టు విభజనతో ముగిసినట్టే.