మరణశిక్ష (ఉరిశిక్ష) అమలుపై దేశంలో గత కొంతకాలంగా అసంతృప్తి రగులుతూనేఉంది. ఇది రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధమన్నవాదన బలపడుతోంది. నేరస్థులకు మరణం అంతిమ పరిష్కారం ఏనాటికీ కాజాలదని మానవతావాదాలు వాదిస్తూనేఉన్నారు. ఉరిశిక్షను ఉంచాలా, లేక భారత నేరశిక్షాస్మృతినుంచి పూర్తిగా ఈ శిక్షను తొలిగించాలా? అన్నది పలువర్గాల్లో చర్చనీయాంశమైంది. ఉరిశిక్షలను చట్టపరమైన హత్యలుగా బావించేవాళ్లూ ఉన్నారు. ఇలాంటి లీగల్ మర్డర్ విషయంలో న్యాయంలేదన్న వాదనలు, నిరసనలు వినిపిస్తూనే ఉన్నాయి.
ఈ నేపథ్యంలో, లా కమిషన్ (న్యాయసలహాసంఘం) ఈ అంశంపై పూర్తిగా అధ్యనంచేసి చివరకు తన సిఫార్సును వెల్లడిచేసింది. ఉగ్రవాదకేసుల్లోమినహా, మిగతావారికి అత్యంతకఠినమైన మరణశిక్షలు విధించడం సబబుకాదని లా కమిషన్ తేల్చిచెప్పింది. టెర్రరిజం లేదా దేశంపై యుద్దం ప్రకటించడం, దేశ భద్రతకు ముప్పురావడం వంటి ఘోరనేరాలకు పాల్పడినవారికి మాత్రం ఉరిశిక్ష విధించడం తప్పుకాదని ఈ సంఘం భావించింది. కాపిటల్ పనిష్మెంట్ అన్నది రాజ్యాంగబద్ధంగా సమర్ధనీయంకాదని లా కమిషన్ పేర్కొన్నది. భారత న్యాయసంఘం చైర్మన్, ఢిల్లీహైకోర్ట్ మాజీ ప్రధానన్యాయమూర్తి ఎ.పి. షా 272పేజీల నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. మరణశిక్షలను ఇప్పటికీ అమలుచేస్తున్న 59 దేశాల్లో మనదేశం కూడా ఒకటి. అయితే మనదేశంలో మాత్రం అరుదైన కేసుల్లో అరుదైన సందర్బంలోమాత్రమే మరణశిక్షను న్యాయస్థానాలు విధిస్తుండటం గమనార్హం.
ఈమధ్యకాలంలో యాకుబ్ మీమన్ కు ఉరిశిక్ష అమలుచేసేటప్పుడు దేశవ్యాప్తంగా ఉరిశిక్షపై చర్చలు జరిగాయి. 1993 బొంబాయి వరుస బాంబుపేలుళ్ల కేసులో దోషిఅయిన యాకూబ్ చివరివరకూ తనకు క్షమాభిక్షప్రసాదించమని కోరుతూ న్యాయపోరాటంచేశాడు. అయితే ప్రతిచోట చుక్కెదురుకావడంతో జులైలో ఈ నేరస్థుణ్ణి ఉరితీశారు. ఆసమయంలోనే యాకూబ్ కు దేశంలో కొన్ని వర్గాల నుంచీ, కొంతమంది ప్రముఖుల నుంచి మద్దతు లభించింది. ఉరిశిక్ష ఆటకవికమైన శిక్షఅనీ, నేరస్థుడికి పడే శిక్ష అతనిలో పరివర్తన తీసుకువచ్చేలాఉండాలేకానీ, ప్రాణంతీసేటంతటి దారుణంగా ఉండకూడదన్న వాదనలు బలంగా వినిపించాయి.
నేరగాళ్ల ప్రాణాలు తీయడమన్నది ఏరకంగా చూసినా న్యాయశాస్త్రసమ్మతంకాదనీ, మానవతావాదంతో నేరస్థుల్లో మానసిక పరివర్తన కలిగించే స్థాయిలోనే శిక్షలుండాలని కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు డి. రాజా ఉగ్రవాది యాకూబ్ మీమన్ ఉరిశిక్ష అమలు సమయంలో వ్యాఖ్యానించడం గమనార్హం.
ఈమధ్యకాలంలో `ఉగ్ర’ నేరాల పరంగా చూస్తే, 2008లో పార్లమెంట్ పై దాడికేసులో అఫ్జల్ గురూని, అలాగే, ముంబయి ఉగ్రదాడికేసులో పాకిస్తాన్ ఉగ్రవాది అజ్మల్ కసబ్ ని , ఈఏడాది జులైలో ఉగ్రవాది యూకూబ్ ని ఉరితీశారు. కాగా, ఇప్పుడు తాజాగా మరో ఇద్దరు విదేశీ ఉగ్రవాదులు (మహ్మద్ నవీద్, సజ్జద్ అహ్మద్) పట్టుబడ్డారు. వీరిద్దరిపై కేసు విచారణ ప్రారంభమైంది. యాకూబ్ ఉరిశిక్ష అమలు విషయంలో చివరివరకూ ఉత్కంఠ పరిస్థితులు తలెత్తాయి. సుదీర్ఘ న్యాయపోరాటం సాగింది. ఉరితీత ముహూర్తానికి కేవలం కొద్దిగంటలముందుమాత్రమే యాకూబ్ కు ఉన్న అన్ని న్యాయపరమైన దారులు మూసుకుపోవడంతో ఉరిశిక్ష అమలైంది. యాకూబ్ పుట్టినరోజునాడే అతని మరణశిక్ష అమలుచేశారు. ఇక ఇప్పుడు తాజాగా పట్టుబడ్డ ఉగ్రవాదులకు శిక్షలు ఖరారయ్యే సమయానికి ఈ వివాదం పూర్తిగా పరిష్కారమయ్యే అవకాశం లా కమిషన్ సిపార్సుల వల్ల కలిగే అవకాశంఉంది. అయితే ఈలోగా భారతప్రభుత్వం ఉరిశిక్ష పై సత్వర చర్యలుతీసుకోవాల్సిఉంటుంది.
ఉగ్రవాదనేరాలను మినహాయిస్తే, మిగతా కేసుల్లో ఉరిశిక్ష (మరణశిక్ష) విధించడం రాజ్యాంగం ప్రసాదిస్తున్న జీవించేహక్కును కబళించడమే అవుతుందని లా కమిషన్ కూడా తేల్చిచెప్పడంతో కేంద్రప్రభుత్వం ఈ సిఫార్సులను పరిగణలోకి తీసుకుని భారతీయ నేర శిక్షాస్మృతిలో మార్పులు తీసుకురావడానికి తలుపులు తెరుచుకున్నట్టయింది.
– కణ్వస