బాలీవుడ్ తారలకు అత్యంత సన్నిహితుడైన ఎన్సీపీ నేత బాబా సిద్దిఖీని తామే చంపామని గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. చాలా రోజులుగా రెక్కీ నిర్వహించి హత్య చేసినట్లుగా ఆ గ్యాంగ్ సభ్యులు ప్రకటించారు. హత్యలో పాల్గొన్న నలుగురిలో ముగ్గుర్ని అరెస్టు చేశారు. గోల్డీ బ్రార్ అనే మరో గ్యాంగ్ స్టర్ తో కలిసి నేర సామ్రాజ్యాన్ని బిష్ణోయ్ నిర్వహిస్తున్నారు. గతంలో సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల వ్యవహారం కూడా తమ పనేనని బిష్ణోయ్ వర్గం ప్రకటించింది.
లారెన్స్ బిష్ణోయ్ ఇప్పుడు తీహార్ జైల్లో ఉన్నాడు. పలు దేశాల్లో ఇతనికి గ్యాంగ్ ఉందని ఏడు వందల మంది షూటర్లు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. హర్యానాకు చెందిన ఓ కానిస్టేబుల్ కుమారుడు అయిన లారెన్స్ బిష్ణోయ్ ముందు నుంచీ నేరస్వభావం ఉన్నవాడు. దోపిడీలు, దొంగతనాలతో ఎదిగారు. తర్వాత కిడ్నాపులు, హత్యలకు పాల్పడుతున్నాడు. పోలీసులు పట్టుకున్నా జైల్లో ఉన్నా.. తన నేర సామ్రాజ్య కార్యకలాపాలు ఆగడం లేదు.
దావూద్ ఇబ్రహీం తరహాలో తన నేర సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నట్లుగా ఇప్పటికే హర్యానా పోలీసులు గుర్తించారు. ఎన్ఐఏ చార్జిషీటు కూడా దాఖలు చేసింది. బాలీవుడ్ ప్రముఖుల్ని బెదిరించి డబ్బులు వసూలు చేయడమే లక్ష్యంగా కాల్పులు జరుపుతున్నట్లుగా భావిస్తున్నారు. గతంలో దావూద్ ను నిర్లక్ష్యం చేసి వదిలివేయడంతో ఆయన అంతర్జాతీయ ఉగ్రవాదిగా మారాడు. ఇప్పుడు లారెన్స్ బిష్ణోయ్ ను ప ట్టుకున్నా.. జైల్లో ఉన్నా.. అతను ఓ మాజీ మంత్రిని.. అత్యంత కీలక నేతను హత్య చేయించగలిగాడంటే… చిన్న విషయం కాదన్న అభిప్రాయం వినిపిస్తోంది.