భాషబేధం లేకుండా కేరళను ఆదుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందడుగు వేస్తున్నారు. అందులో సినిమా ప్రముఖులూ వున్నారు. మలయాళీలకు అండగా మేమున్నామంటూ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చలనచిత్ర ప్రముఖులు కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నారు. తెలుగు నుంచి చిరంజీవి, మహేశ్‌బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్‌చరణ్, అల్లు అర్జున్… తమిళం నుంచి కమల్ హాసన్, విజయ్… ఒక్కొక్కరూ పాతిక లక్షల రూపాయలను కేరళకు విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రముఖ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ వీరందరి కంటే నాలుగు రేట్లు ఎక్కువ మొత్తాన్ని విరాళంగా ప్రకటించారు. కేరళకు కోటి రూపాయల ఆర్థిక సహాయం చేయడానికి ముందుకొచ్చాడు. శనివారం కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌కి అందజేయనున్నట్టు సోషల్ మీడియాలో రాఘవ లారెన్స్ తెలిపారు. వరద బాధిత ప్రాంతాలకు నేరుగా వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని అనుకున్నప్పటికీ… వర్షాలు భారీగా కురుస్తున్న కారణంగా వద్దని కేరళ అధికారులు సూచించినట్టు రాఘవ లారెన్స్ పేర్కొన్నారు. తెలుగు హీరో నాగార్జున రూ. 28 లక్షలు, తమిళ హీరో విక్రమ్ రూ. 35 లక్షలు సహాయం చేసిన సంగతి తెలిసిందే.