తమిళనాడు ప్రభుత్వం మరో ట్రెండ్ సెట్ చేసింది. గవర్నర్ కానీ..రాష్ట్రతి కానీ ఆమోదించకుండానే చట్టాలను నోటిఫై చేసింది. ఇప్పటి వరకూ ఇలా రాజ్ భవన్ నోటిఫై చేయాల్సి వచ్చేది. కానీ గవర్నర్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం వల్ల ప్రభుత్వానికే ఆ అవకాశం వచ్చింది. ఇది భారత ప్రజాస్వామ్య చరిత్రలో కీలక మలుపు అనుకోవచ్చు. మొత్తం పది చట్టాలను నోటిఫై చేస్తూ తమిళనాడు ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది.
తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి .. అక్కడి అసెంబ్లీ ఆమోదించిన చట్టాలను నెలల తరబడి ఆమోదించలేదు. దాదాపుగా పదమూడు చట్టాలు రాజ్ భవన్ లో పెండింగ్ లో పెట్టుకున్నారు. తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ సమయంలో పది చట్టాలను తిరస్కరించి రెండింటిని పరిశీలన కోసం రాష్ట్రపతికి పంపారు. ఒక్క బిల్లును ఆమోదించారు. దీంతో పది చట్టాలను తమిళనాడు అసెంబ్లీ మళ్లీ ఆమోదించి గవర్నర్కు పంపింది. రాజ్యాంగం ప్రకారం రెండో సారి అసెంబ్లీ ఆమోదిస్తే గవర్నర్ ఆమోదించాల్సిందే. కానీ ఆయన రాష్ట్రపతికి బిల్లులను పంపేశారు.
దీనిపై సుప్రీంకోర్టు విచారణ జరిపి తమిళనాడు గవర్నర్ రాజ్యాంగాన్ని అతిక్రమించారని తేల్చింది. చట్టాలను అసెంబ్లీ రెండో సారి ఆమోదిస్తే గవర్నర్ ఆమోదం అవసరం లేదని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పుతో తమిళనాడు ప్రభుత్వం పది చట్టాలను నోటిఫై చేసింది. ఇక ముందు గవర్నర్లను అడ్డం పెట్టుకుని రాష్ట్రాలను వేధించాలనుకునేవారికి.. అలాంటి అవకాశం లేకుండా పోయిందని అనుకోవచ్చు.