ఇటీవల ప్రేక్షకుల్ని గుండెల్ని పట్టేసిన సినిమాల్లో `జై భీమ్` ఒకటి. సూర్య నటించిన `జై భీమ్` అణగారిన వర్గాల బాధల్ని, వాళ్ల కోసం పోరాటం చేసే ఓ లాయర్ కథనీ కళ్లకు కట్టింది. ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ఆరోగ్యకరమైన చర్చ జరిగింది. ఈ దశాబ్దపు ఉత్తమ చిత్రాల్లో `జై భీమ్` కూడా ఉందన్నది విశ్లేషకుల తీర్పు. ఈ సినిమాతోనే చంద్రూ అనే ఓ లాయర్ గురించి దేశానికి తెలిసింది. `జై భీమ్` కల్పిత కథ కాదు. చంద్రూ అనే లాయర్ కథ. తనకెదురైన ఓ కేసు చుట్టూ ఈ సినిమా తిరిగింది. ఈ సినిమా వచ్చాకే.. చంద్రూ ఎవరు? అనే ఆసక్తి నెలకొంది. అతని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలన్న కుతూహలం మొదలైంది. `జై భీమ్`లో చూసిందంతా ఆయన కథే. చూడని కథ ఇంకా చాలా ఉంది. ముఖ్యంగా చంద్రూది ప్రేమ వివాహం అనే సంగతి ఎవరికీ తెలీదు. భారతి అనే లెక్చలర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు చంద్రూ. అదీ.. నలభై ఏళ్ల తరవాత. ఈ ప్రేమకథని.. ఈ సినిమాలో ఎక్కడా చూపించలేదు. బహుశా కథ.. డైవర్ట్ అవుతుందని భావించారేమో..? అదే తెలుగు సినిమాల్లో అయితే.. ఈ ప్రేమకథని అడ్డుపెట్టుకుని దర్శకులు పాటలూ, రొమాన్స్ అంటూ నానా కంగాళీ చేసేవాళ్లేమో..? ఏదేమైనా.. కథని వీలైనంత నిజాయతీగా, అసలు పాయింట్ పైనే ఫోకస్ చేసి చెప్పడం వల్ల `జై భీమ్` ఇంత మందికి నచ్చింది.