ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోర్టు వ్యవహారాలతోనే తీరిక లేకుండా ఉంటుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై అందరూ కోర్టుకెళ్లడం.. . వాటిపై ప్రభుత్వం వాదనలు వినిపించడం.. లాయర్లకు ప్రజాధనమే కోట్లకు కోట్లు చెల్లించడం రివాజుగా మారింది. అప్పుడప్పుడు మాత్రమే… లాయర్లకు చెల్లిస్తున్న ఫీజుల వివరాలు బయటకు వస్తున్నాయి. తాజాగా.. రాజధానికి సంబంధించి రైతులపై పోలీసులు మోపిన కేసుల్లో వాదించాడనికి ఎస్. నిరంజన్ రెడ్డి అనే లాయర్‌ను నియమించుకున్నారు. ఆయన వాదించిన కేసులకు సంబంధించి రూ. 96 లక్షలు విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. రైతులపై పోలీసులు రకరకాల కేసులు పెట్టారు. చివరికి వారిపై అట్రాసిటీకేసులు కూడా పెట్టారు. ఆ కేసుల్ని వాదించడానికి నిరంజన్ రెడ్డిని లాయర్‌గా పెట్టుకున్నారు.
కొద్దిరోజుల క్రితమే… తాను రాసిన కాన్ఫిడెన్షియల్ లేఖలు లీక్ అయ్యాయని ఎస్ఈసీగా ఉన్నప్పుడు… నిమ్మగడ్డ దాఖలు చేసిన పిటిషన్‌పై రాజ్ భవన్ తరపున వాదించిన లాయర్ కోసం… రూ. యాభై లక్షలు రిలీజ్ చేస్తూ జీవో ఇచ్చారు. గతంలో పలు కేసులకు సంబంధించి అనేక మంది లాయర్లకు ఇలా రూ. లక్షలకు లక్షలు విడుదల చేస్తున్నారు. సుప్రీంకోర్టు వరకూ వెళ్తున్న కేసులకు సంబంధించి… ఢిల్లీలో అత్యంత ఖరీదైన లాయర్లను నియమించుకుంటున్నారు. రఘురామకృష్ణరాజుకు బెయిల్ రాకుండా… నిమిషానికి రూ. లక్షల్లో చార్జ్ చేసే దుష్యంత్ దవేను నియమించుకున్నారు. గతంలో రాజధాని తరపున కేసులను సుప్రీంకోర్టు వరకూ వస్తే వాదించడానికి రూ. ఐదు కోట్లతో… ముకుల్ రోహత్గీని మాట్లాడుకున్నారు.
మొత్తంగా అన్ని విభాగాల కింద లాయర్లకు.. పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నట్లుగా తెలుస్ోతంది. ఇలా నియమితులవుతున్న లాయర్లు కూడా.. దాదాపుగా ఒకే వర్గానికి చెందిన వారు. నిజానికి ప్రభుత్వానికి వాదనలు వినిపించడానికి కోర్టుల్లో ఓ వ్యవస్థ ఉంటుంది. అడ్వకేజ్ జనరల్ సారధ్యంలో ఈ వ్యవస్థ పని చేస్తూ ఉంటుంది. వీరికి కూడా.. రూ. కోట్లలోనే చెల్లింపులు ఉంటున్నాయి. అదే సమయంలో పలువుర్ని ప్రభుత్వ న్యాయవాదులుగా నియమించి.. రూ. లక్షల్లో జీతాలు ఇస్తున్నారు. వీరందరూ ఉన్నా.. బయట కేసులకు సంబంధించి.. ఇతర ఖరీదైన లాయర్లను మాట్లాడుకుని ప్రజాధనం వెచ్చిస్తున్నారు.
ప్రభుత్వం తీసుకునే ప్రజావ్యతిరేక నిర్ణయాలు కోర్టుల్లో తేలిపోతున్నాయి. అయితే ప్రభుత్వ పెద్దలు పట్టుదలగా హైకోర్టు లేకపోతే సుప్రీంకోర్టు అన్నట్లుగా ప్రజాధనం వెచ్చించి న్యాయపోరాటం చేస్తున్నారు కానీ.. తాము చట్ట విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటున్నామనే సంగతిని ఆలోచించడం లేదు. ఫలితంగా రూ. కోట్లకు కోట్లు ప్రజాధనం న్యాయవాదులకు వెళ్తోంది. ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ.. ఆ ప్రజల సొమ్ముతోనే కోర్టుల్లో పోరాడటం ఏపీ ప్రభుత్వ ప్రత్యేక శైలి. ఏ ప్రభుత్వానికైనా ప్రజాధనం ఖర్చు విషయంలో కాస్తంత అటూ ఇటూ ఆలోచిస్తుంది..కానీ ఈ సర్కార్ మాత్రం అలాంటివేమీ పట్టించుకోవడం లేదు.