విశాఖకు సెక్రటేరియట్… కర్నూలుకు హైకోర్టు అంటూ అభివృద్ధి పంపకాలు చేసిన జగన్మోహన్ రెడ్డి సర్కార్.. ప్రజల మధ్య స్పష్టమైన ప్రాంతీయ విభజన చేసినట్లుగా తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. ఐదు జిల్లాల న్యాయవాదులు.. జేఏసీగా ఏర్పడ్డారు. హైకోర్టు తరలింపునకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించారు. కర్నూలుకు హైకోర్టు తరలింపు ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ.. కోస్తా జిల్లా న్యాయవాదులు నిరసన తెలుపుతున్నారు. కోర్టుల్లో కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి. బార్ అసోసియేషన్ లు నిరవధిక బాయ్ కాట్ కి పిలుపునిచ్చాయి. కొన్నాళ్ల క్రితం.. ఇలాంటి ప్రచారం జరిగినప్పుడు.. చాలా రోజుల పాటు… లాయర్లు విధులకు హాజరు కాలేదు.
కర్నూలు ప్రాంతాన్ని అభివృద్ది చేయాలంటే… ఏ పరిశ్రమలో, విద్యా సంస్థలు వంటివో నెలకొల్పాలి కానీ… అందర్నీ ఇబ్బంది పెట్టేలా హైకోర్టుని తరలించడం ఏమిటని లాయర్లు ప్రశ్నిస్తున్నారు. ఐదు జిల్లాలలాయర్లు ప్రత్యేకంగా జేఏసీ ఏర్పాటు చేసుకుని ఉద్యమ కార్యాచరణ ప్రకటించుకుంటున్నారు. కృష్ణా జిల్లా, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల న్యాయవాదులు, రాష్ట్ర న్యాయవాదుల బార్ కౌన్సిల్ సభ్యులు అత్యవసర సమావేశం నిర్వహించి… విధులు బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు. అమరావతి రైతులకు మద్దతుగా .. హైకోర్టు కోసం.. తాము కూడా పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు.
గతంలో ప్రతిపక్ష నేతగా అమరావతిలో హైకోర్టు ఏర్పాటును సమర్థించిన జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ప్రాంతీయ భావంతో కర్నూలుకు తరలించాలని అనుకోవడం అన్యాయమని లాయర్లు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు.. ప్రాంతీయ ఉద్యమాలకు ఆజ్యం పోశాయి. తమ రాజధాని తీసుకెళ్తున్నారని అమరావతి రైతులు… తమకు జగన్ ఇచ్చిన రాజధానిని అడ్డుకుంటున్నారని.. ఉత్తరాంధ్ర వాసులు… హైకోర్టును దగ్గర చేసి.. సెక్రటేరియట్‌ను దూరం చేశారని రాయలసీమ వాసులు ఆందోళనలకు దిగుతున్నారు.