తెలంగాణలో ఇటీవలే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ ముగించుకుంది. త్వరలోనే భాజపా సంస్థాగత ఎన్నికలు త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ శాఖకు కొత్త అధ్యక్షుడు ఎవరు అనే చర్చ ఆ పార్టీ వర్గాల్లో మొదలైనట్టు సమాచారం. ఆశావహుల జాబితా కాస్త పెద్దదే అయినప్పటికీ… ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న లక్ష్మణ్, మరోసారి తానే కొనసాగేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. పార్లమెంటు ఎన్నికల తరువాతి నుంచి ఆయన స్వరం పెంచిన తీరు మనం చూస్తున్నదే. పార్టీ తరఫున ధీటుగా మాట్లాడుతూ, తెరాస సర్కారుపై తీవ్రమైన విమర్శలు చేస్తూ, కేసీఆర్ తో ఢీ అంటే ఢీ అన్నట్టుగా కనిపిస్తూ… అంతా తానే అన్నట్టుగా వ్యవహరించే ప్రయత్నం చేస్తున్నారు. భాజపా ఢిల్లీ పెద్దలతో ఆయనకి మంచి సంబంధాలున్నాయి కాబట్టి, మరోసారి తనకే అవకాశం దక్కుతుందన్న ధీమాతో ఉన్నట్టు సమాచారం.
వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో తెరాసకు ప్రత్యామ్నాయ శక్తిగా నిలబెట్టే ఉద్దేశంలో జాతీయ నాయకత్వం ఉంది. కాబట్టి, రాష్ట్రంలో కూడా పార్టీ పగ్గాలు రాబోయే నాలుగేళ్లూ ఎవరి చేతికి ఇవ్వాలనే అంశంపై ఒకటికి పదిసార్లు ఆలోచించే అవకాశం లేకపోలేదు. లక్ష్మణ్ విషయానికొస్తే… ఆయన పనితీరు మీద జాతీయ నాయకత్వానికి మంచి అభిప్రాయమే ఉందని అంటారు. అయితే, ఒకే ఒక్క మైనస్ పాయింట్ ఏంటంటే… అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ముషీరాబాద్ నియోజక వర్గం నుంచి డిపాజిట్లు కూడా లేకుండా ఓటమిపాలయ్యారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న నాయకుడు డిపాజిట్లు కోల్పోవడమంటే… ఓ రకంగా అవమానకరమైన పరిస్థితే. పైగా, అక్కడ ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా! సొంత నియోజక వర్గంలో డిపాజిట్లు కూడా దక్కని నాయకుడిని రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగిస్తే… విమర్శలకు ఆస్కారం ఉంటుందేమో అనే కోణంలో పార్టీ ఆలోచిస్తుందా అనే చర్చ ఉండనే ఉంది.
ఈసారి తెలంగాణ భాజపా అధ్యక్ష పదవి కోసం గట్టిపోటీనే ఉంటుంది. ఎందుకంటే, ఇప్పుడు పార్టీ అధ్యక్ష్య పదవి దక్కించుకుంటే… భాజపా తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం కూడా దక్కినట్టే అనే అభిప్రాయం టి. భాజపాలో కీలక నేతలకు ఉంది. లక్ష్మణ్ ప్రయత్నం కూడా అదేననీ… అందుకే, కాస్త గట్టిగానే మరోసారి తనని కొనసాగించే విధంగా పరిస్థితులను ప్రభావితం చేసే ప్రయత్నం మొదలుపెట్టారనీ వినిపిస్తోంది! జితేందర్ రెడ్డి, డీకే అరుణ, చిలకల రామచంద్రారెడ్డి, ప్రభాకర్, రామచంద్రరావు… ఇలా ఎప్పట్నుంచో భాజపాలో కొనసాగుతున్నవారు కూడా పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో ఉన్నారని సమాచారం.