ఆర్టికల్ 370 రద్దు చేస్తూ కేంద్రంలోని మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయానికి దేశవ్యాప్తంగా మంచి మద్దతే లభించింది. మిత్రపక్షాలే కాదు, ఇతర రాజకీయ పార్టీల నుంచి కూడా మద్దతు లభించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ… మోడీ సర్కారు తీసుకుంటున్న సాహసోపేతమైన నిర్ణయాలు పార్టీకి కొత్త ఊపు తెస్తున్నాయనీ, తెలంగాణలో తమకు మరింత ప్రోత్సాహం లభిస్తోందని అన్నారు. ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370 రద్దుకి పార్లమెంటులో తెరాస మద్దతు ఇచ్చిందనీ, ఒకవేళ ఇవ్వకపోతే ఇక్కడి ప్రజల్లో చులకన అయిపోతారన్న ఉద్దేశంతోనే తెరాస సహకరించిందన్నారు. తెరాస, భాజపాల మధ్య స్నేహం ఎప్పటికీ సాధ్యం కాదన్నారు.
ఆర్టికల్ 370 రద్దు ప్రభావం తమ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మీద ఉందన్నారు. ఒక్కసారిగా భాజపా మీద ప్రజల్లో మరింత సానుకూల చర్చ జరుగుతోందనీ, పెద్ద సంఖ్యలో సభ్యులు చేరేందుకు ఉత్సాహపడుతున్నారన్నారు. రాష్ట్రంలో 50 శాతం ఓటు బ్యాంకు సాధించడం తమ లక్ష్యం అన్నారు. తెలంగాణకు చెందిన ప్రముఖ కాంగ్రెస్ నాయకులు తమతో టచ్ లో ఉన్నారనీ, త్వరలోనే పెద్ద సంఖ్యలో తమ పార్టీలోకి వలసలు ఉంటాయన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భాజపాలో చేరుతారని లక్ష్మణ్ స్పష్టం చేశారు. తమ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ప్రత్యేక ద్రుష్టి పెడితే ఏ రాష్ట్రంలోనైనా ఏదైనా సాధిస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ విమోచన దినాన్ని సెప్టెంబర్ 17న అధికారికంగా నిర్వహిస్తున్నామనీ, గోల్కొండలో నిర్వహిస్తున్న సభకు హోం మంత్రి అమిత్ షా వస్తున్నారని చెప్పారు.
ఆర్టికల్ 370 రద్దు చేయడం భాజపా తీసుకున్న మంచి నిర్ణయమే. దేశవ్యాప్తంగా అందరూ మద్దతు పలుకుతున్న పరిస్థితి. దేశప్రయోజనాలకు ముడి పడి ఉంది కాబట్టే, రాజకీయాలకు అతీతంగా ఇతర పార్టీల నుంచి మంచి మద్దతు భాజపాకి లభించింది. అయితే, మోడీ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంతో… సభ్యత్వ నమోదు పెరుగుతుందనీ, వలసలు పెరుగుతాయంటూ పార్టీ సొంత ప్రయోజనాలకు దాన్ని ఆపాదించి చెప్పడం ఎంతవరకూ సరైంది..? ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాలు భాజపాకి కచ్చితంగా మంచి పొలిటికల్ మైలేజ్ ఇస్తాయనడంలో సందేహం లేదు. కాకపోతే, దాని గురించి ఇలా ఓపెన్ గా ఆ పార్టీ నాయకులే మాట్లాడితే… రాజకీయ ప్రయోజనాల కోసమే ఇలాంటి అంశాలపై నిర్ణయాలు తీసుకుంటున్నారా అనే అభిప్రాయం ప్రజలకు కలుగుతుంది. తాజాగా లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు అలానే ఉన్నాయి.