తెలంగాణ రాష్ట్ర భాజపా అధ్యక్ష పదవి ఎంపిక ప్రక్రియ దాదాపు చివరికి వచ్చేసింది. ఈ దిశగా పార్టీ జాతీయ నాయకత్వం వరుసగా అభిప్రాయ సేకరణ, నాయకులతో సమావేశాలు నిర్వహిస్తోంది. ఈనెల మూడో వారంలోగా తెలంగాణకు కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయాలని ప్రయత్నిస్తోంది. ప్రస్తుత అధ్యక్షుడు లక్ష్మణ్ మరోసారి కొనసాగుతారనే అభిప్రాయం ఈ మధ్య వ్యక్తమైంది. అయితే, ఇప్పుడా అభిప్రాయంలో కొంత మార్పు వచ్చినట్టు తెలుస్తోంది. కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసం వరుసగా రెండుసార్లు రాష్ట్రానికి వచ్చి, ఇక్కడి నేతలతో సమావేశమయ్యారు పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ కృష్ణదాస్. తొలిదఫా సమావేశం తరువాత… లక్ష్మణ్ నాయకత్వాన్ని కొనసాగించాలని మెజారిటీ నేతలు కోరుకుంటున్నారంటూ పార్టీ అధినాయకత్వానికి నివేదిక ఇచ్చారు. ఇటీవల, అంటే రెండో దఫా రాష్ట్రానికి వచ్చి వెళ్లాక… లక్ష్మణ్ ని మారిస్తే బాగుంటుందని నేతలు కోరుకుంటున్నారని నివేదిక ఇచ్చారట!
దీంతో ఆశావహులు ఇప్పుడు ఢిల్లీ నాయకత్వం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. అయితే, పార్టీలో కొత్తగా చేరినవారికి అధ్యక్ష బాధ్యతలు ఇవ్వకూడదనే అభిప్రాయంతో అధినాయకత్వం ఉందనే అభిప్రాయం తెరమీదికి వచ్చింది! ఈ నేపథ్యంలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తీవ్ర ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు సమాచారం. ఆయనకి ఆర్.ఎస్.ఎస్. మద్దతుగా నిలుస్తోంది. అంతేకాదు… భాజపా జాతీయ నాయకత్వానికి ఆర్.ఎస్.ఎస్. ద్వారా తన పేరును ఖరారు చేయాలంటూ సంజయ్ సిఫార్సు చేయించారనీ తెలుస్తోంది. ఈ నేపథ్యంలో లక్ష్మణ్ కూడా ఢిల్లీ వెళ్లి అమిత్ షా, నడ్డాలను మరోసారి కలిసి వచ్చారు. తనకు లోక్ సభ సీటు ఇవ్వలేదనీ, కాబట్టి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు తనకే ఇవ్వాలని కోరినట్టు సమాచారం.
ఇతర ఆశావహులూ ఎవరిదారిలో వారు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. జితేందర్ రెడ్డి కూడా అమిత్ షాని కలిసి… అధ్యక్ష బాధ్యతలు తనకు ఇవ్వాలంటూ కోరారు. డీకే అరుణ కూడా భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. మురళీధరరావు కూడా తనకు జాతీయ నాయకత్వంతో ఉన్న సాన్నిహిత్యం మేరకు ఆయన కూడా ఆశావహుల్లో ఒకరిగా చేరారు. మొత్తానికి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవికి గట్టి పోటీ ఉన్నట్టు కనిపిస్తోంది. ప్రధానంగా లక్ష్మణ్ వెర్సెస్ సంజయ్ అన్నట్టుగా వాతావరణం ఉంది. ఈ నేపథ్యంలో భాజపా జాతీయ నాయకత్వం ఎవరికి పేరుకి టిక్ పెడుతుందో చూడాలి.