మంత్రి ఈటెల రాజేందర్ అంశం ఈ మధ్య రాజకీయంగా కొంత చర్చనీయమైన సంగతి తెలిసిందే. ఆయన్ని మంత్రి వర్గం నుంచి తొలగిస్తారనే కథనాలొచ్చాయి, ఆయన కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలే చేశారు. అయితే, ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్. ఆయన మీడియాతో మాట్లాడుతూ… కేసీఆర్ పాలనలో బీసీలు వివక్షకు గురౌతున్నారన్నారు. తెరాస ఎంతగా అణచి వేస్తోందో మంత్రి ఈటెల రాజేందర్ చేస్తున్న వ్యాఖ్యల ద్వారా బయటపడిందన్నారు.
తెరాసలో చేరిన బీసీ నేతలకు అన్యాయం జరగడం అనేది ఆ పార్టీలో మొదట్నుంచీ ఉన్న సంప్రదాయమే అని లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా విజయశాంతి, ఆలె నరేంద్ర, డి.శ్రీనివాస్ ల గురించి ప్రస్థావించారు. వీళ్లందరినీ కేసీఆర్ మోసం చేశారన్నారు. ఉద్యమ సమయంలో అంతా తానై కీలకంగా నిలిచిన ఆలె నరేంద్రకు తగిన గౌరవం ఇవ్వలేదనీ, విజయశాంతిని కూడా అలాగే విస్మరించారనీ, ఇక డి.శ్రీనివాస్ విషయంలో సొంత పార్టీవారే ఆయనపై ఫిర్యాదులు చేసుకున్న పరిస్థితి ఉందన్నారు. ఇదే సమయంలో బండారు దత్తాత్రేయకు గవర్నర్ పదవి దక్కడాన్ని ప్రస్థావిస్తూ… తమ పార్టీ బీసీలకు ఇచ్చే ప్రాధాన్యత, గౌరవం ఇలా ఉంటుందని ఉదహరించారు. రాష్ట్రంలో చాకలి, నాయి బ్రాహ్మణులు వివక్షకు గురౌతున్నారన్నారు. ట్యాంక్ బండ్ మీద చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ప్రతిష్టిస్తామన్నారు.
తెరాసలో బీసీ నేతలకు దక్కే ప్రాధాన్యతను లక్ష్మణ్ కరెక్ట్ సమయంలో తెర మీదికి తెచ్చారనే చెప్పాలి. దత్తాత్రేయకు గవర్నర్ పదవి ఇవ్వడాన్ని కూడా బీసీలకు భాజపా ఇస్తున్న ప్రాధాన్యతగా ప్రచారం మొదలుపెట్టారు అనొచ్చు! దీని తగ్గట్టుగానే తెరాసలో ఈటెల వ్యవహారాన్ని కూడా ప్రస్థావించారు. ఎస్సీ జాబితాలో రజకులను చేరుస్తామంటున్నారు. భాజపాలో బీసీ నాయకులకు కూడా ప్రాధాన్యత ఉంటుందని చెప్పే ప్రయత్నం ద్వారా… వలస నేతల్ని ఆకర్షించే ప్రయత్నమూ చేశారు. నలుగురు నాయకుల పట్ల తెరాస వ్యవహరించిన తీరుపై భాజపా చేస్తున్న ఈ విమర్శలకు తెరాస ఎలా స్పందిస్తుందో చూడాలి. నిజానికి, ఈటెల విషయంలో పార్టీ సైలెంట్ గానే ఉంది. ఇక, డీఎస్ అంశం ఎటూ తేల్చులేకపోతోంది. ఆయనే పార్టీ విడిచిపోతారనే ఎదురుచూపుల్లో ఉంది. మొత్తానికి, బీసీల పట్ల తెరాస వైఖరి ఏంటనేది వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. భాజపా వ్యాఖ్యలపై తెరాస స్పందించకపోతే… కమలానికి ఈ ప్రచారం ప్లస్ అయ్యే అవకాశాలున్నాయి.