ఎన్నికల సంఘం మీద ఆ మధ్య చాలా విమర్శలు వినిపించిన సంగతి తెలిసిందే. అధికార పార్టీకి అండగా వ్యవహరిస్తోందనీ, వారు ఆడించినట్టల్లా ఆడుతోందంటూ లోక్ సభ ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈసీ మీద ఫిర్యాదులకే ప్రధాన పార్టీలు ప్రాధాన్యత ఇచ్చాయి. అయితే, ఇప్పుడు తెలంగాణలో భాజపా ఇదే తరహా విమర్శలు మొదలుపెట్టేసింది. రాష్ట్రంలో ఎన్నికల యంత్రాంగంపై నమ్మకం లేదంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఫిర్యాదు చేశారు.
రాష్ట్ర యంత్రాంగం అధికార పార్టీకి అనుకూలంగా ఉందనీ, హుజూర్ నగర్ ఉప ఎన్నిక కోసం కేంద్రం నుంచి ఒక ప్రత్యేక పరిశీలకుడిని పంపించాలంటూ లక్ష్మణ్ కోరారు. తెరాస, కాంగ్రెస్ పార్టీలు డబ్బును పెద్ద మొత్తంలో పంచేందుకు సిద్ధమౌతున్నాయంటూ ఫిర్యాదు చేశారు. సర్పంచుల సంఘం అధ్యక్షుడిని ఎన్నికల్లో పోటీకి దిగకుండా చేసేందుకు కేసులు పెట్టారనీ, సాంకేతిక కారణాలను చూపిస్తూ దాదాపు 30 మంది గిరిజన నేతలు, ఇండిపెండెంట్ల నామినేషన్లను తిరస్కరించారని లక్ష్మణ్ అన్నారు. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ఎన్నికల అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తూ అధికార పార్టీకి లొంగి పనిచేస్తున్నారంటూ ఆరోపించారు.
ఎన్నికల సంఘం స్వతంత్ర వ్యవస్థే. కానీ, కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చాక స్వతంత్ర వ్యవస్థలకు ఉన్న స్వేచ్ఛ ప్రశ్నార్థకంగా మారిపోయింది. అధికార పార్టీ అదుపాజ్ఞల్లో నడవాల్సిన పరిస్థితుల్ని తీసుకొచ్చారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అప్పటి అధికార పార్టీ టీడీపీ విషయంలో ఈసీ స్పందన ఎలా ఉందో చూశాం. భాజపాకి అనుకూలంగా ఉన్న పార్టీ చేసిన ఫిర్యాదులపై ఒకలా స్పందించడం, వ్యతిరేకంగా ఉన్న టీడీపీ ఫిర్యాదుల్ని లెక్క చేయకపోవడం చాలా విమర్శలకు తావిచ్చింది. తెలంగాణలో అధికార పార్టీ తెరాస మీద భాజపా వ్యవహరిస్తున్న తీరు గతంలో మాదిరిగా ఇప్పుడు లేదు. కాబట్టి, రాష్ట్ర ఎన్నికల అధికారులపై లక్ష్మణ్ చేసిన ఈ ఫిర్యాదు నేపథ్యంలో హుజూర్ నగర్ కి పరిశీలకుడిని కేంద్ర ఎన్నికల సంఘం పంపిస్తుందేమో చూడాలి. ఒక అసెంబ్లీ స్థానం ఉప ఎన్నిక మీద కేంద్ర ఎన్నికల సంఘం స్పందిస్తుందా… అంటే, ఏమో… ఫిర్యాదు చేసింది భాజపా నేతలు, స్పందించకుండా ఎలా ఉంటారు?