పార్లమెంటు ఎన్నికల తర్వాతి రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి పరిస్థితి దారుణంగా ఉండబోతుందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ హాట్ కామెంట్స్ చేశారు. బుధవారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై సొంత పార్టీ ఎమ్మెల్యేలు తిరగబడి, అసహనంతో రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి ఓటేశారన్నారు. తెలంగాణలోనూ హిమాచల్ పరిస్థితి తలెత్తవచ్చన్నారు. హిమాచల్ ప్రదేశ్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో సొంత పార్టీ వారే అక్కడి ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారన్నారు. దీంతో ఆ రాష్ట్ర సీఎం రాజీనామా చేసి, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోయమంటు తన నిస్సాహాయతను వ్యక్తం చేశారని గుర్తు చేశారు. కర్ణాటకలోనూ అదే రీతిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై తిరుగబడుతున్నారన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బొటాబోటీ మెజార్టీతో 64సీట్లతో ఉందని, తుమ్మితే ఊడిపోయే పరిస్థితిలో ఉందన్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాతా తెలంగాణలో ఏం జరుగుతుందో చూడండని, ఏదైనా జరుగవచ్చన్నారు. తెలంగాణ మరో కర్నాటక అవుతుందా హిమాచల్ ప్రదేశ్ అవుతుందో చూడండన్నారు. ఢిల్లీలో లేని కాంగ్రెస్ తెలంగాణలో ఎంత మొత్తుకుంటే లాభమేంటన్నారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేక ఇబ్బందులు పడుతుందన్నారు. ఈ నేపధ్యంలో ఇక్కడ కూడా హిమాచల్ ప్రదేశ్ మాదిరిగా కాంగ్రెస్లో తిరుగుబాటు రావచ్చంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
లక్ష్మణ్ వ్యాఖ్యలు సహజంగానే తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్,కర్ణాటకల్లో బీజేపీకి కొంత బలం ఉంది. కానీ తెలంగాణలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. మూడో సారి కేంద్రంలో అధికారంలోకి వస్తే… దర్యాప్తు సంస్థల్ని ప్రయోగించి అయినా ఎమ్మెల్యేల్ని కాంగ్రెస్ కు దూరం చేసినా… పడగొట్టాలంటే… బీఆర్ఎస్ మద్దతు కావాల్సిందే. లక్ష్మణ్ మాటల్ని బట్టి చూస్తే బీఆర్ఎస్ తో కలిసేందుకు బీజేపీ సిద్ధమవుతోందన్న అభిప్రాయాన్ని రాజకీయవర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీతో పొత్తు కోసం బీఆర్ఎస్ గట్టి ప్రయత్నాలు చేస్తోందన్నప్రచారం జరుగుతున్న సమయంలో లక్ష్మణ్ వ్యాఖ్యలు సహజంగానే హాట్ టాపిక్ అవుతున్నాయి.