రెండోసారి తిరుగులేని సంఖ్యాబలంతో తెరాస ప్రభుత్వం ఏర్పడింది. ఇంకా బలం చాలదన్నట్టుగా కాంగ్రెస్ ఎల్పీని కూడా విలీనం చేసుకుంది. ఐదేళ్లపాటు తెరాస అధికారానికి ఎలాంటి ఢోకా లేదన్నది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. అంతేకాదు, మరో రెండు టెర్ములు కూడా తెరాస అధికారంలో ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ చెప్పిన సంగతీ తెలిసిందే. ఎలా చూసుకున్నా కేసీఆర్ సర్కారు మనుగడ మీద ఎవ్వరికీ ఎలాంటి అనుమానాలూ వ్యక్తం కావు. కానీ, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మాత్రం… రాష్ట్రంలో మధ్యంతరం వస్తుందని జోస్యం చెబుతున్నారు! కేసీఆర్ ప్రభుత్వం మీద ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుందని ఆశిస్తున్నారు!
తెరాస మీద ప్రజలకు పూర్తి విసుగుతో ఉన్నారనీ, రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉందన్నారు లక్ష్మణ్. రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ జరుగుతోందనీ, రాజకీయమంతా తెరాస వెర్సస్ భాజపా మాత్రమే ఉందన్నారు. తెరాసను రాజకీయంగా ఎదుర్కోవడం కోసం లెఫ్ట్, రైట్ అని తేడాలు లేకుండా అన్ని పార్టీలకు చెందినవారూ భాజపాలో చేరేందుకు సిద్ధపడుతున్నారన్నారు. తెరాస ఎమ్మెల్యే షకీల్ భాజపాలోకి చేరతారని లక్ష్మణ్ ధీమాగా చెప్పారు! ఆయనతోపాటు మరికొంతమంది కూడా తమతో టచ్ లో ఉన్నారనీ, ఇది ట్రైలర్ మాత్రమేననీ, అసలు చిత్రం ఇంకా ముందుందని ధీమా వ్యక్తం చేశారు. తెరాస నుంచి నాయకుల చేరిక అనేది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందన్నారు.
తెరాస నుంచి షకీల్ దూరమౌతారనే పరిస్థితి వచ్చినా… ఆయన్ని మళ్లీ బుజ్జగించిన సంగతి తెలిసిందే. అయితే, ఆయన మా పార్టీలోకి వస్తారని లక్ష్మణ్ ఇప్పుడు ధీమా వ్యక్తం చేస్తున్నారు! ఇక, మధ్యంతరం టాపిక్ దగ్గరకి వస్తే… ఎలా చూసుకున్నా అలాంటి పరిస్థితి రాష్ట్రంలో లేదు. కనీసం తెరాసలో అంతర్గతంగా నాయకుల మధ్య ఏమైనా లుకలుకలు ఉన్నాయన్నా…. మంత్రి వర్గ విస్తరణ సందర్భంలో వినిపించిన అసంతృప్తి స్వరాలపై అప్రమత్తమై దిద్దుబాటు చర్యలు జరిగిపోయినట్టే కనిపిస్తోంది. తెరాస నుంచి ఎమ్మెల్యేలు వలస రావడం అనేది భాజపాకి బలం చాటుకునే అంశం కాబట్టి, ప్రస్తుతానికి వచ్చేవారు ఎవరూ కనిపించడం లేదు కాబట్టి, అనూహ్యంగా రాజకీయంగా ఏదో మారిపోతుందనే అభద్రతను ఊహించి చెప్పడం ద్వారా… నేతల్ని ఆకర్షించాలనేది లక్ష్మణ్ వ్యూహంగా కనిపిస్తోంది. ఇది వర్కౌట్ అయ్యే వ్యూహమా కాదా అనేది తెలుస్తూనే ఉంది! ఇంకోటి… రాజకీయ పునరేకీకరణ అంటే, తెరాసకు వ్యతిరేకంగా ఇతర పార్టీల మద్దతుగా తీసుకునే ప్రయత్నం చెయ్యాలి. అంతేగానీ, నాయకుల్ని భాజపాలో చేర్చుకోవడమే పునరేకీకరణ అంటే ఎలా..?