మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటుకుని తెరాసకు తామే ప్రత్యామ్నాయం అని నిరూపించుకుంటామని భాజపా రంగంలోకి దిగింది. కానీ, ఆశించిన స్థాయిలో ఫలితాలేం దక్కలేదు. అయినాసరే, తాము రెండో స్థానానికి ఎదిగామని అంటున్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. దాదాపు 90 శాతం స్థానాల్లో సొంతంగా పోటీ చేయగలిగామనీ, ఎలాంటి పొత్తూ లేకుండా తెరాసకు గట్టి పోటీ ఇచ్చామంటున్నారు. అధికారం అండతో, ధన బల ప్రలోభాలతో ఎన్ని ఒత్తిళ్లకు గురి చేసినా అంతిమంగా ఓటర్లు తమను ఆదరించారనీ, రాష్ట్రంలో కార్పొరేషన్లలో భాజపా రెండో స్థానానికి వచ్చిందన్నారు.
లక్ష్మణ్ చెబుతున్నంత నమ్మకంగానే భాజపా తెలంగాణలో బలపడిందా… ఒక్కసారి లెక్కలు చూద్దాం. మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ తెరాసకు 43 శాతం ఓటింగ్ దక్కింది. ఆ తరువాతి స్థానంలో కాంగ్రెస్ ఉంది. నిజానికి, ఆ పార్టీ నుంచి నాయకులు వలసలు పోతున్నా, నాయకత్వలేమితో, ఆధిపత్య పోరుతో కొట్టుమిట్టాడుతున్నా 21.7 శాతం ఓటింగు దక్కించుకోవడం విశేషం. భాజపా విషయానికొస్తే … 14.91 శాతం ఓటింగ్ దక్కింది. కార్పొరేషన్లలో దాదాపు 22 శాతం వరకూ భాజపాకి ఓటింగ్ దక్కింది. అంటే, నగరాల్లో భాజపా పట్టు కొంతమేరకు పెరిగిందనే చెప్పాలి. లక్ష్మణ్ చెబుతున్నట్టు ఇప్పటికిప్పుడు రెండో స్థానంలో భాజపా లేకపోయినా… గణనీయంగా పార్టీ విస్తరిస్తోందనొచ్చు. పార్టీపరంగా కొంత బేస్ అయితే ఏర్పడిందని చెప్పొచ్చు.
కేంద్రంలో అధికారంలో ఉండటం, దేశవ్యాప్తంగా ఒక అనుకూలత మోడీకి ఉండటం ఇక్కడా ప్లస్ అయింది. దీంతోపాటు, ఎమ్.ఎమ్.ఐ.ని ఇక్కడ ప్రస్థావించుకోవాలి. ఎందుకంటే, గతంలో హైదరాబాద్ కి మాత్రమే పరిమితమైన పార్టీ ఇప్పుడు రాష్ట్రంలో చాలా స్థానాల్లో పోటీ చేసింది. ఆ పార్టీ కూడా విస్తరిస్తోందనే అనాలి. దానికి కౌంటర్ గా హిందు ఓటు బ్యాంకును భాజపా బలంగా ఆకర్షించే ప్రయత్నమూ కొంతమేర ఫలించిందనీ చెప్పొచ్చు. ఇంకోటి… తెలంగాణలో కాంగ్రెస్, తెరాసల మీద విముఖత ఉన్నవారికి మూడో ప్రత్యామ్నాయ వేదికగా భాజపా కనిపించిందనీ అనొచ్చు. గతంలో టీడీపీ, వైకాపాలకి ఓటు బ్యాంకులు బాగానే ఉండేవి. అవి కూడా కొంతమేరకు భాజపా వైపు మళ్లాయనీ చెప్పొకోవచ్చు. ఓటింగ్ శాతం పరంగా చూసుకుంటే భాజపా తెలంగాణలో ఇప్పుడు మూడో స్థానంలోనే ఉన్నా… ఈ మూడు కారణాల దృష్ట్యా ఆ పార్టీ పట్టు పెరిగేందుకు ఉన్న అవకాశాలను కొట్టిపారేయలేం. ఇప్పటికిప్పుడు భాజపాతో ఇబ్బందేం లేదని కాంగ్రెస్, తెరాసలు ఈజీగా తీసుకునే స్థాయిలో భాజపా లేదనే చెప్పాలి.