రాష్ట్రంలో ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్రతరం అయిపోయింది కాబట్టి, రెవెన్యూ ఉద్యోగుల అసంతృప్తి కాస్తా తెరమరుగైంది. ఆ శాఖలోనూ ఉద్యోగులు గుర్రుగానే ఉన్నారు. శాఖను మొత్తంగా మార్చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పిన దగ్గర్నుంచీ నిరసనలు వ్యక్తమయ్యాయి. వాటిని కూడా సీఎం కేసీఆర్ పెద్దగా పట్టించుకోకుండానే వస్తున్నారు! అయితే, ఇప్పుడు ఉద్యోగులకు పీఆర్సీ అంటూ కొన్ని లీకులు సీఎం ఆఫీస్ నుంచి వస్తున్నాయి. పీఆర్సీ మీద కరసత్తు మొదలైందనీ, ముఖ్యమంత్రి ఏదో ఒక నిర్ణయాన్ని త్వరలో ప్రకటిస్తారని కథనాలు వినిపిస్తున్నాయి. ఆర్టీసీ సమ్మె తీవ్రతరం కావడంతో, ఇతర శాఖల ఉద్యోగుల నుంచి అలాంటి తరహా నిరసన వ్యక్తమైతే రాష్ట్రంలో పరిస్థితి మరింత ఇబ్బందిగా మారుతుందనే అంచనాకు సీఎం వచ్చారనీ, అందుకే ఇలాంటి లీకులిస్తూ… ఇతర శాఖల ఉద్యోగులను, ఆర్టీసీ కార్మికులను కలవకుండా చేసేందుకు జరుగుతున్న వ్యూహాత్మక ఎత్తుగడే ఇది అంటూ భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపిస్తున్నారు.
ఆర్టీసీ సమ్మెకు రెవెన్యూ ఉద్యోగులు తోడైతే కేసీఆర్ కి రాజకీయంగా పుట్టగతులు లేకుండా పోతారని అన్నారు లక్ష్మణ్. అందుకే ఇప్పుడు పీఆర్సీని తెరమీదికి తెస్తున్నారనీ, ఒకవేళ నిజంగానే పీఆర్సీ ఇవ్వాలనే ఉద్దేశం ముఖ్యమంత్రికి ఉంటే ఉద్యోగులతో సమావేశమై, వారితో చర్చించాక పీఆర్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ ఇవ్వాలంటూ గత ఏడాదే కమిటీ తమ నివేదికను ప్రభుత్వానికి ఇచ్చిందనీ, ఇన్నాళ్లూ ఈ అంశాన్ని పట్టించుకోకుండా ఇప్పుడు స్పందిస్తున్నట్టు లీకులు ఇవ్వడమేంటన్నారు. రెవెన్యూ ఉద్యోగులు సమ్మెకి దిగితే పరిస్థితి మరింత జఠిలమౌతుందని ముఖ్యమంత్రికి తెలుసు అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల భుజంపై తుపాకీ పెట్టి, ఆర్టీసీ కార్మికులను కాల్చేందుకు చేస్తున్న ప్రయత్నమే ఇదన్నారు. రెండోసారి ప్రధాని అయిన మోడీ గ్రాఫ్ పైపైకి వెళ్తుంటే, రెండోసారి సీఎం అయిన కేసీఆర్ గ్రాఫ్ రానురానూ కిందికి పడిపోతోందని లక్ష్మణ్ విమర్శించారు.
ఉన్నట్టుండి ఇప్పుడు పీఆర్సీ తెరమీదికి రావడం, దీనిపై ముఖ్యమంత్రి అధికారులతో మాట్లాడారంటూ లీకులు రావడం… ఇవన్నీ ఉద్యోగులను ఆకర్షించేందుకు చేసే ప్రయత్నాలు అనే లక్ష్మణ్ ఆరోపణల్లో కొంత నిజమే కనిపిస్తోంది. రెవెన్యూశాఖతోపాటు ఇతర శాఖల ఉద్యోగుల్లో కూడా తీవ్ర అసంతృప్తి ఉంది. పంచాయతీ సెక్రటరీలను కొత్తగా నియమించాక తొలిజీతాన్ని మూడు నెలల తరువాత ఇచ్చారు. ఆ తరువాత, ఆరునెలల బడ్జెట్ ని పంచాయతీలకు ఇచ్చారు. అది కూడా అయిపోయి… ఇప్పుడు మళ్లీ జీతాలు విడుదల ఎప్పుడో అన్నట్టుగా ఎదురుచూస్తున్నారు. ఆర్టీసీ సమ్మె ఇలాంటివాందరికీ ఓరకంగా స్ఫూర్తినిచ్చే అంశంగా మారితే… కచ్చితంగా రాష్ట్రప్రభుత్వం తీవ్ర ఒత్తిడి ఎదుర్కోవాల్సి ఉంటుంది.