ఎన్టీఆర్ జీవిత కథ `ఎన్టీఆర్` బయోపిక్ రూపంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ చరిత్ర ఎంత కావలిస్తే అంత ఉంది. కాబట్టి సన్నివేశాలకు కొదవ లేదు. పైగా తనయుడు బాలకృష్ణ దగ్గర కావల్సినంత సమాచారం ఉంది. ఎన్టీఆర్పై వచ్చిన పుస్తకాలకు లెక్కలేదు. ఎవరి వెర్షన్ వాళ్లది. అందులో పాజిటీవ్ పాయింట్లే తీసుకుంటారనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఎన్టీఆర్ చివరి రోజుల్లో.. లక్ష్మీపార్వతి ఆయన పక్కనే ఉన్నారు. పీఏగా, సహచర్మధారిణిగా… లక్ష్మీపార్వతి ఆయనతో ప్రయాణం చేశారు. ఎన్టీఆర్ గురించి ఆమె ఓ పుస్తకం కూడా రాశారు. ఇప్పుడు వాటిలో కొన్ని ఆసక్తికరమైన అంశాలు `ఎన్టీఆర్`లో పొందు పరిచారని తెలుస్తోంది. ఎన్టీఆర్ స్వయంగా లక్ష్మీపార్వతికి చెప్పిన విషయాలు కావడంతో… ఆ పుస్తకంపై `అధికారిక` ముద్ర పడినట్టే. ఎన్టీఆర్ స్క్రిప్ట్ దశలో ఉన్నప్పుడే.. బాలకృష్ణ వివిధ పుస్తకాల్ని తిరగేశారు. అందులో లక్ష్మీపార్వతి రచించిన `ఎదురులేని మనిషి` ఒకటి. అందులోని అంశాలు వాస్తవానికి దగ్గరగా అనిపించడంతో…. వాటిని స్క్రిప్టులో పొందుపరచినట్టు తెలుస్తోంది. నన్ను సంప్రదించకుండా ఈ సినిమాని ఎలా తీస్తారు? అని లక్ష్మీ పార్వతి పదే పదే అడుగుతున్న ప్రశ్నకు ఇప్పుడు సమాధానం దొరికేసినట్టే.