గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ కచ్చితంగా ఆశలు పెట్టుకునే నియోజకవర్గాల్లో ఒకటి ఎల్పీనగర్. గత ఎన్నికల్లో… ఆర్.కృష్ణయ్యను బరిలోకి దింపారు. ఆయన గెలిచారు. కానీ పార్టీతో అంటీ ముట్టనట్లుగా ఉన్నారు. చివరికి ఆయనను టీడీపీ లెక్క నుంచి తీసేసింది. కాంగ్రెస్‌తో పొత్తు తర్వాత … ఇప్పుడా సీటు టీడీపీకి వస్తుందా లేదా అన్న టెన్షన్ ప్రారంభమయింది. టీడీపీ తరపున ఎల్బీనగర్ టిక్కెట్ కోసం.. పదేళ్లుగా ప్రయత్నిస్తున్న సామ రంగారెడ్డి.. ఇప్పటికే పోటీకి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసుకున్నారు. గత ఎన్నికల్లో ఆయనకే టిక్కెట్ రావాల్సింది. చివరి క్షణంలో.. ఆర్.కృష్ణయ్యకు టిక్కెట్ ఇవ్వడంతో.. సామ రంగారెడ్డి బాధ్యతగా ఆయనను గెలిపించుకున్నారు.
ఎలాగైనా ఈసారి టీడీపీ సిట్టింగు సీటును టీఆర్ఎస్ ఖాతాలో వేసుకునేందుకు ఆ పార్టీ అధిష్టానం ముమ్మర కసరత్తులు ప్రారంభించింది. ఇప్పటికే టీఆర్ఎస్ తరపున గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ముద్దసాని రామ్మోహన్ గౌడ్ ను మరోసారి అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో ఆయన గెలుపు కోసం ఎల్బీనగర్ కార్పోరేటర్లు, నాయకులు, కార్యకర్తలంతా ప్రచార పర్వాన్ని మొదలు పెట్టేశారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు పట్టు ఉంది. ఈ క్రమంలో ఆ రెండింట్లో ఏదో ఒక పార్టీకి మాత్రమే ఎల్బీనగర్ టికెట్‌ను కేటాయిస్తారన్న దానిపై స్పష్టత రాలేదు. కాంగ్రెస్ తరపున మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో ఆర్ కృష్ణయ్య గెలవగా.. టీఆర్ఎస్ అభ్యర్థి రెండో స్థానంలో ఉన్నారు. కాంగ్రెస్ తరపున పోటీ చేసిన సుధీర్ రెడ్డి మూడో స్థానంలో ఉన్నారు. టీడీపీ, కాంగ్రెస్‌కు మధ్య 30 వేల ఓట్ల తేడా ఉంది.
ఈ నియోజకవర్గంలో రాష్ట్రేతరుల ప్రభావం అధికంగా ఉంటుంది. మొత్తం 4.65 లక్షల ఓట్లకు గానూ సుమారు 70 వేల ఓట్లు వారివే ఉన్నట్లు అంచనా. ఈ క్రమంలో టీడీపీ నేతలు గత ఎన్నికల్లో టీడీపీకి వచ్చిన ఓట్ల శాతం.. కాంగ్రెస్‌కు వచ్చిన ఓట్ల శాతం ఎంత అనే లెక్కలు తీసి కాంగ్రెస్ ముందు పెడుతున్నారు. 2009 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 8 మందికి గానూ ఏడుగురు టీడీపీ కార్పొరేటర్లు గెలుపొందారు. 2014 సాధారణ ఎన్నికల్లో టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా ఆర్.కృష్ణయ్య గెలుపొందగా.. కాంగ్రెస్ అభ్యర్థి సుధీర్‌రెడ్డి మూడో స్థానంలో నిలిచారు. 2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థుల్లో ఒక్కరు కూడా గెలవలేదు. ప్రతి చోటా టీడీపీ అభర్థులే రెండో స్థానంలో నిలిచారు. అంతేకాకుండా ఎల్బీనగర్ నియోజకవర్గం టీడీపీ సిట్టింగ్ స్థానం. ఎంపీ కూడా టీడీపీ నుంచి గెలిచిన వ్యక్తే. ఇలా ఆయా ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ బలాబలాలు, సిట్టింగ్ స్థానం తదితర అంశాలను ముందు పెట్టి ఎల్బీనగర్ను టీడీపీకే కేటాయించాలన్న డిమాండ్‌తో ఆ పార్టీ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీకి కేటాయించినా, టీడీపీకి కేటాయించినా రెబల్ బెడద తప్పేట్లు లేదు. కాంగ్రెస్ కు కన్ఫాం చేస్తే టీడీపీ నుంచి రెబల్ అభ్యర్థిగా సామ రంగారెడ్డి పోటీకి దిగడం ఖాయం. అలా అని టీడీపీకి కేటాయించినా కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న సుధీర్ రెడ్డి రంగంలోకి దిగడం గ్యారెంటీ. మొత్తానికి ఈ నియోజకవర్గం నుంచి ఒకరు టీఆర్ఎస్ తరపున, రెండు మహాకూటమి తరపున పోటీ చేసినా, ముచ్చటగా మూడో అభ్యర్థి మాత్రం రెబల్ గా ఉంటారని రాజకీయ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.