కేరళ ప్రజలు గత మూడున్నర దశాబ్దాలుగా పాటిస్తున్న ఆనవాయితీ ప్రకారం అధికారంలో ఉన్న యు.డి.ఎఫ్.ని దించి ప్రతిపక్షంలో ఉన్న ఎల్.డి.ఎఫ్.కి అధికారం కట్టబెట్టారు. ఐదేళ్ళ తరువాత మళ్ళీ దానిని దించి మళ్ళీ యు.డి.ఎఫ్.కే అధికారం కట్టబెడతారు. కనుక ఆ రెండు కూటముల శక్తి సామర్ధ్యాలను, లోటుపాట్లను చూసి కాక కేరళ ప్రజలు ఆనవాయితీ ప్రకారమే ప్రభుత్వాన్ని మార్చేరని భావించవలసి ఉంటుంది.
కేరళలో ఉన్న 140 స్థానాలలో 139 స్థానాలకి ఫలితాలు వెలువడ్డాయి. అధికార కాంగ్రెస్ నేతృత్వంలోని యు.డి.ఎఫ్. 47 సీట్లు గెలుచుకోగా, ఎల్.డి.ఎఫ్.91 సీట్లు గెలుచుకొని తిరుగులేని విజయం సాధించింది. భాజపా తరపున తిరువనంతపురం నుంచి పోటీ చేసిన క్రికెటర్ శ్రీశాంత్ ఓడిపోయారు. భాజపాకి చెందిన ఓ.రాజగోపాల్ నమోమ్ నియొజకవర్గం నుంచి విజయం సాధించడంతో కేరళలో భాజపాకి మొదటిసారి అడుగుపెట్టగలిగింది.
కేరళలో ఎల్.డి.ఎఫ్.కి 87 ఏళ్ల వయసున్న మాజీ ముఖ్యమంత్రి అచ్యుతానందన్ నాయకత్వం వహించారు కనుక, మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఆయన తన స్వస్థలమైన అలపుజ నియోజక వర్గం నుంచి 27,148 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.