తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి.. సొంత పార్టీలో చిక్కెట్ల లొల్లిని ఓ రేంజ్లో తెచ్చి పెడుతున్నారు. గతంలో బస్సుయాత్రలో తన వర్గానికి చెందిన వారిని పరోక్షంగా అభ్యర్థుల్ని ప్రకటించి వివాదాస్పదమయ్యారు. ఆ తీరును ఇప్పటికీ మార్చుకోలేదు. గట్టి పోటీ ఉన్న నియోజకవర్గాల్లోనూ .. అదే తీరులో వ్యవహరిస్తున్నారు. మూడు రోజుల కిందట… సూర్యాపేటలో యూత్ కాంగ్రెస్ ఓ సభను నిర్వహించింది. ఇందులో ప్రసంగించిన ఉత్తమ్‌కుమార్ రెడ్డి.. దామోదర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. తానే టిక్కెట్ ఖరారు చేసేశారు. దీంతో టిక్కెట్‌పై ఆశలు పెట్టుకున్న పటేల్ రమేష్ రెడ్డికి కోపం వచ్చింది.
రేవంత్ రెడ్డితో పాటు టీడీపీలో చేరిన నేత పటేల్ రమేష్ రెడ్డి. సూర్యాపేటలో బలమైన అనుచరగణం ఉంది. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో పరాజయం పాలయ్యారు. ఉత్తమ్ ప్రకటన చేసిన వెంటనే ఆయన వేదిక దిగి వెళ్లిపోయారు. రేవంత్ రెడ్డి టిక్కెట్ల హామీ తీసుకున్న నేతల్లో రమేష్ రెడ్డి కూడా ఉన్నారన్న ప్రచారం జరిగింది. రమేష్‌రెడ్డి వెంటనే కుంతియాకు ఫిర్యాదు చేశారు. ఆ మాట అనుకోకుండా వచ్చిందని… సర్వేలు చేసి హైకమాండ్ టిక్కెట్లు ఇస్తుందని.. ఉత్తమ్ కూడా.. వివరణ ఇవ్వడంతో సూర్యాపేట నేతలు శాంతించారు. ఇదే కాదు.. గతంలో బస్సు యాత్ర చేస్తున్న సమయంలో నిర్మల్, తాండూర్, పాలకుర్తి, మణుగూరు అభ్యర్థుల్ని కూడా ఇలాగే ప్రకటించారు. దీంతో సీనియర్లు ఉత్తమ్‌పై మండిపడ్డారు. ఉప్పుడు కాస్తంత వెనక్కి తగ్గారు పీసీసీ చీఫ్. ఇప్పుడు మళ్లీ సూర్యాపేటతో ప్రారంభించారు.
ఉత్తమ్‌తో పాటు.. ఉత్తమ్ కన్నా బలమైన లీడర్లుగా ప్రకటించుకునేందుకు కొంత మంది.. ఏఐసిసి కార్యదర్శుల సమక్షంలోనే టిక్కెట్ల ప్రకటనలు చేస్తున్నారు. ఇంధిరాభవన్ లో జరిగిన రంగారెడ్డి జిల్లా సమీక్షా సమావేశంలో ఓ సీనియర్ నేత కిచ్చన్నగారి లక్ష్మారెడ్డికి టిక్కెట్ ఇస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఏఐసిసి కార్యదర్శి బోసురాజు విస్తుపోవాల్సి వచ్చింది. ఇదే నియోజకవర్గం నుంచి టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన జంగయ్య యాదవ్ పోటీకి ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికల్లో టిడీపీ నుంచి పోటీచేసిన జంగయ్య రెండో స్థానంలో నిలిచారు. ఇక ఇటీవల సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం విషయంలోనూ విబేధాలు భగ్గుమన్నాయి. అజరుద్దీన్‌కు సీటు ఖరారు చేసినట్లు తేలడంతో.. అంజన్ కుమార్ యాదవ్ రచ్చ చేశారు.
ఈ టిక్కెట్ల లొల్లిని వీలైనంతగా తగ్గించేందుకు ఏఐసిసి కార్యదర్శులు శ్రీనివాసన్ క్రిష్ణన్, సలీం అహ్మద్, బోసు రాజులు జిల్లాలు చుట్టేస్తున్నారు. వీరు వెళ్లినప్పుడు పార్టీ నేతలు.. రచ్చ చేస్తున్నారు. ఈ తంటాలు వీరికి తప్పడం లేదు. ఇప్పుడే ఇలా ఉంటే.. ఎన్నికల ముందు కాంగ్రెస్ మార్క్ ప్రజాస్వామ్యం కాంగ్రెస్‌లో మరింత ఎక్కువైపోయే సూచనలు కనిపిస్తున్నాయి.