ఎన్నికలకు ముందు ఓ రాజకీయ పార్టీపై అంచనాలు ఎలా ఉన్నాయనేది ఆ పార్టీలో ఉండే చేరికల్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో చేరికల జోరు కొనసాగింది. టిక్కెట్లు రావని తెలిసినా చాలా మంది నేతలు చేరిపోయారు. ఇప్పుడు ఏపీలో రాజకీయం వేడెక్కుతోంది. ఫిబ్రవరిలోనే ఎన్నికల షెడ్యూల్ వస్తుందన్న నమ్మకంతో అన్ని రాజకీయ పార్టీలు కార్యకలాపాలు పెంచాయి.
వ్యూహాత్మకమో.. వ్యూహాత్మక తప్పిదమో కానీ వైసీపీ చీఫ్ , సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంచార్జుల మార్పు పేరుతో గందరగోళం సృష్టించుకుంటున్నారు. వంద మందిని తీసేస్తామని ప్రచారం చేసుకుంటున్నారు. పది మంది మంత్రుల పేర్లూ ప్రచారంలోకి వచ్చాయి. దీంతో అందరిలోనూ ఆందోళన ప్రారంభమయింది. అధికారికంగా టిక్కెట్ రాదని తెలిసిపోయిన వారి అనుచరులు రాజీనామాల బటపట్టారు. టిక్కెట్ రాదని కంగారు పడుతున్న నేతల సంఖ్య తక్కువేం లేదు. అలాంటి వారందరూ ఇప్పటికైతే సైలెంట్ గా ఉన్నారు. కానీ.. తెర వెనుక ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం వైసీపీలో చేరికలేమీ లేకపోగా.. ఉన్నవారు రాజీనామా చేస్తున్నారు.
తెలుగుదేశం, జనసేన పార్టీ పొత్తులు పెట్టుకుని పోటీ చేస్తూండటం, మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలవడంతో పాటు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని తేలిపోయింది. తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడం వంటి కారణాలతో ప్రతిపక్షానికి మంచి ఊపు వచ్చింది. అందుకే రోజు మార్చి రోజు.. ఆ పార్టీ కార్యాలయాలు సందడిగా మారుతున్నాయి. పార్టీలో చేరేందుకు వివిధ నియోజకవర్గాల నుంచి జిల్లాల వారీగా వైసీపీకి చెందిన ద్వితీయ శ్రేణి నేతలు వస్తున్నారు. గురువారం టీడీపీ , జనసేన కార్యాలయాల్లో జోరుగా చేరికలు జరిగాయి. కానీ మంగళగిరిలోని వైసీపీ కార్యాలయం ముందు మాత్రం ఎలాంటి సందడి లేదు.
మొత్తంగా వైసీపీ ప్రకటించిన ఇంచార్జ్ లు మార్పు.. రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు తెచ్చాయి. అది వైసీపీ పెద్దలు ఊహించినట్లగా పాజిటివ్‌గా కాకుండా నెగెటివ్‌గా ఉండటమే అసలు రాజకీయం.