తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడానికి ఇంకా నెలకుపైగా సమయం ఉంది. బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా వచ్చేసింది. కానీ కాంగ్రెస్ మాత్రం టాక్ ఆఫ్ ది టౌన్ అవుతోంది. ఆ పార్టీలో చేరబోతున్న నేతలంటూ జరుగుతున్న ప్రచారమే దీనికి కారణం . బీజేపీ సీనియర్ నేత గడ్డం వివేక్.. కాంగ్రెస్ పార్టీలో చేరడం లాంచనమేని చెబుతున్నారు. ఆయన సోదరుడు వినోద్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వివేక్ లోక్ సభ టిక్కెట్ ఆశిస్తున్నారు. ఆయనది సంప్రదాయంగా కాంగ్రెస్ ఫ్యామిలీ. ఇక ఈటల రాజేందర్ పేరు కూడా జోరుగా ప్రచారంలోకి వస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ఇప్పటికీ అందరికీ డౌటే.
ఇక ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరరావు చేరికను దాదాపుగా ఫైనల్ చేసుకున్నారని అంటున్నారు. బీఆర్ఎస్ లో టిక్కెట్ ప్రకటించిన మైనంపల్లికి కాంగ్రెస్ రెండు టిక్కెట్లు ఆఫర్ చేసిందని చెబుతున్నారు. వీరంతా .. అటు ఇటూగా వచ్చే నెలలో కాంగ్రెస్ లోచేరిపోవచ్చని చెబుతున్నారు. కాంగ్రెస్లో ఫీల్ గుడ్ పాజిటివ్ వాతావరణం కనిపిస్తోంది. బీఆర్ఎస్ లో కనిపించని ఓ రకమైన ఆత్మవిశ్వాసం.. కాంగ్రెస్ లో కనిపిస్తోంది. పదేళ్ల అధికార వ్యతిరేకత ఊహించనంతగా ఉంటుందన్న అంచనాలు కిందిస్థాయిలోనూ వినిపిస్తూండటంతో..కాంగ్రెస్ కు డిమాండ్ పెరుగుతోంది.
కేసీఆర్ రెండు చోట్ల పోటీ ప్రకటన .. సిట్టింగ్లకు అభ్యర్థులను ప్రకటించడాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నరు. మొత్తంగా తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికకు మందే ఫీల్ గుడ్ వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుంటోంది. కొన్ని సర్వేల్లో ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గుతున్నారన్న సంకేతాలు రావడంతో… వారిలో మరింత ఉత్సాహం పెరుగుతోంది. అందుకే తెలంగాణ రాజకీయాలు ముందు ముందు మరింత ఆసక్తికరంగా మారనున్నాయి.