కూటమి పార్టీల్లో కొంత మంది నేతలు చేస్తున్న తమ నేతల భజన… విధేయతా ప్రదర్శనలు హాట్ టాపిక్ అవుతున్నాయి. అయితే వారంతా తామ విధేయతను ప్రదర్శించి ఏదో ఓ పదవిని పొందడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగమేనని హైకమాండ్ కూడా నమ్ముతోంది. అందుకే పెండింగ్ ఉన్న నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయడానికి కసరత్తు దాదాపుగా పూర్తి చేశారు. నెలాఖరులో లేదా.. వచ్చే నెల మొదటి వారంలో ద్వితీయ శ్రేణి నేతలకు పదవుల పంపకం చేయనున్నారు.
ప్రాథమిక వ్యవసాయ సొసైటీలు, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలు , రాష్ట్రస్థాయిలో పలు కార్పొరేషన్ ఛైర్మన్, డైరెక్టర్ల పదవులను భర్తీ చేయాల్సి ఉంది. అలాగే దేవాలయాల పాలకమండలిపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది ఇంద్రకీలాద్రి, సింహాచలం, అన్నవరం, శ్రీశైలం, శ్రీకాళహస్తి పాలకమండళ్లు, జిల్లా నియోజకవర్గస్థాయిలో పదవుల ఎంపికపై పేర్లు పంపాలంటూ ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేసింది. చాలా మంది ఇప్పటికే పేర్లు పంపారు. వారి గురించి బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ పూర్తి చేసి.. ప్రకటన చేయనున్నారు.
కూటమిలో టీడీపీకి 80 శాతం, జనసేన 15 శాతం, బీజేపీకి 5 శాతం మేర పదవులు ఇస్తున్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి పదవులు ఇవ్వాలని టీడీపీ ఓ రూల్ గా పెట్టుకుంది. కేసులు పాలైనా వారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. యువత కు ఎక్కువ అవకాశం కల్పిస్తున్నారు. నామినేటెడ్ పోస్టుల విషయంలో లోకేష్ మార్క్ కనిపిస్తోంది. పదవులు పొందిన అందరూ.. పార్టీ.. కూటమి బలపేతానికి కష్టపడేలా దిశానిర్దేశం చేయనున్నారు.