ఎన్నికల నగారా మోగింది. అయితే ఎన్నడు లేని విధంగా ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలను మొదటి విడతలోనే చేర్చారు. ఏప్రిల్ 11 నుండి మొదలై దాదాపు 40 రోజుల పాటు జరిగే ఎన్నికల సంగ్రామంలో, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ఎన్నికలు రెండు కూడా మొదటి రోజునే జరుగుతాయి. మరి ముందు నుండి కూడా ఏప్రిల్ నెలాఖరు కిె తెలుగు రాష్ట్రాల ఎన్నికలు ఉంటాయని భావించినప్పటికీ మొదటి విడతలోనే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ఎన్నికలను ఇలా మొదటి విడతలోనే నిర్వహించడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని రాజకీయ నాయకులు అంటున్నారు. నిన్న తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు గండ్ర వెంకటరమణారెడ్డి ఈ ఆరోపణలు చేస్తే, ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్ తెలుగుదేశం నాయకుడు కళావెంకట్రావు ఇదే ఆరోపణలు చేశారు.
బీజేపీ ఉనికి లేనటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు మొదటి విడత లోనే ఎన్నికలు జరపడం, అది కూడా ఒకే ఫేజ్ లో ఈ ఎన్నికలు జరగడం, బిజెపి ఉనికి ఉన్న రాష్ట్రాలలో మాత్రం మలి విడతలో ఎన్నికలు జరగడం, అది కూడా దశల వారీగా ఆ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగడం చూసిన విశ్లేషకులకు ఎన్నికల సంఘం పైన బిజెపి నుంచి రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయి. నిన్న ఇదే విషయంపై మాట్లాడిన గండ్ర వెంకట రమణా రెడ్డి, మోడీ కి గులాం లాగా వ్యవహరిస్తున్న కెసిఆర్ కి సాయం చేయడానికి తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలను మొదటి విడతలో చేర్చారని, ఇది ఒక రకమైన మ్యాచ్ ఫిక్సింగ్ అని గండ్ర ఆరోపణలు చేశారు. ఇప్పుడు కళా వెంకటరావు కూడా ఇదే ఆరోపణలు చేస్తున్నారు. కెసిఆర్ కి, జగన్ కి సమాచారం ముందుగానే ఇచ్చి, తెలుగు రాష్ట్రాల ఎన్నికలను మొదటి విడతలో చేర్చారని, ఇది మోడీ కనుసన్నల్లో జరిగిందని కళా వెంకటరావు ఆరోపించారు. అలాగే దీని ద్వారా ముందస్తుగా సమాచారం పొందిన జగన్ తగిన ఏర్పాట్లు చేసుకున్నారు అని, అలాగే చంద్రబాబు మరొక సారి తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడానికి సమయం లేకుండా చేయడం ద్వారా కేసీఆర్ కి కూడా మోడీ సహాయం చేశారని ఆయన ఆరోపించారు.
ఇటు కాంగ్రెస్ నాయకులు, అటు తెలుగుదేశం నాయకులు ఇద్దరు కూడా మోడీ, కేసీఆర్, జగన్ కుమ్మక్కు అయ్యారని బలంగా ఆరోపిస్తున్నారు. అయితే జనసేన అభిమానుల లో కూడా ఇప్పుడిప్పుడే ఇవే అనుమానాలు బలపడుతున్నాయి. పవన్ కళ్యాణ్ ,పాత పార్టీలలో ఉన్న అదే నాయకులను లాక్కోవడం కాకుండా కొత్త తరం నాయకులను పోటికి నిలపాలన్న ఉద్దేశంతో ఉన్నాను అని ప్రకటించిన దరిమిలా, సహజంగానే ఆ ప్రాసెస్ ఎంతో సమయం తీసుకుంటుంది. దీంతో ఒక నెల రోజులపాటు ఎన్నికలను ముందుకు జరపడం ద్వారా పవన్ కళ్యాణ్ ను దెబ్బ తీసినట్లయితే తనకు లాభం చేకూరుతుందని భావిస్తూ, అందుకోసమే కెసిఆర్, మోడీ లకు జగన్ లొంగి పోయాడని, జన సేన అభిమానులు భావిస్తున్నారు. గత రెండేళ్లుగా మోడీ తో కుమ్మక్కయ్యారంటూ జగన్ మీద వస్తున్న ఆరోపణలు ఇప్పటికే ఎంతో కొంత డామేజ్ చేసినప్పటికీ, కీలకమైన ఎన్నికల సమయంలో వస్తున్న ఇటువంటి ఆరోపణలు జగన్ మీద తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం మీద ఎక్కువగా డిపెండెన్సీ లేనటువంటి తెలంగాణ రాష్ట్రానికి చెందిన కెసిఆర్ , మోడీ తో ఎంతగా రాసుకుపూసుకు తిరిగినప్పటికీ ఆయనకు పెద్దగా నష్టం లేకపోవచ్చు కానీ ఆయనతో సరిగా జగన్ కూడా తిరిగితే ఆంధ్రప్రదేశ్లో ఉన్న మోడీ వ్యతిరేకత జగన్ మీదకు గట్టిగానే మళ్లే అవకాశం కనిపిస్తోంది.
మరి ఎన్నికల తేదీ విషయం మీద జరుగుతున్న ఈ రాజకీయం, ఫలితాల ను ఏ విధంగా ప్రభావితం చేస్తుందన్నది వేచి చూడాలి.