గెలిచే పార్టీలోకి నేతలు వెల్లువలా వచ్చి చేరుతూ ఉంటారు. అది సహజం. అయితే ఆ గెలుపును ఎంత మంది నమ్ముతారన్నది కీలకం. ఏపీలో 80 శాతం మంది వైసీపీ నేతలు కూడా టీడీపీ – జనసేన కూటమి తిరుగులేని విజయం సాధిస్తుందని నమ్ముతున్నారు. అందుకే గెలిచే పార్టీలో కర్చీఫ్ వేసేందుకు పోటీ పడుతున్నారు. వైసీపీలో బలమైన నేతలుగా పేరున్న వారు వచ్చి చేరుతున్నారు. టిక్కెట్లు ఇవ్వని వారు కాదు… టిక్కెట్ ఖరారు చేసిన వారు కూడా వచ్చి చేరుతున్నారు.
తిరుపతి ఎంపీ టిక్కెట్ ఖరారు చేసిన సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం తనకు వద్దని చెప్పి టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆయన ఒక్కరే కాదు.. నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఖరారైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా టీడీపీలో చేరి ఎంపీగా పోటీ చేయాలని అనుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇక లావు కృష్ణదేవరాయులు సంగతి చెప్పాల్సిన పని లేదు. మాగుంట శ్రీనివాసులరెడ్డి , ఆదాల ప్రభాకర్ రెడ్డి సహా అనేక మంది పేర్లు వినిపిస్తున్నాయి. వీరందరికీ టిక్కెట్ నిరాకరించడం వల్ల కాదు.. టిక్కెట్ ఇచ్చినా టీడీపీలోకి వస్తున్నారు.
నియోజకవర్గ, జిల్లా స్థాయి నేతలే కాదు.. ద్వితీయ శ్రేణి నేతలు కూడా తరలి వస్తున్నారు. వైసీపీలోని ద్వితీయ శ్రేణి నాయకత్వం పెద్ద ఎత్తున పార్టీ మారుతున్నారు. బా ఏకగ్రీవంగా ఎన్నికైన జడ్పీటీసీలు కూడా టీడీపీలో చేరుతున్నారు. నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్తాయిలో కూడా చేరికలు ఉంటున్నాయి. ఈ స్థాయిలో వైసీపీ క్యాడర్ వలస పోతూండటం ఆ పార్టీ నేతల్ని విస్మయ పరుస్తోంది. నిజానికి చంద్రబాబు ఇంకా చేరికల మిషన్ ప్రారంభించలేదు. పొత్తులు, సీట్ల సర్దుబాటుపై క్లారిటీ రావాల్సి ఉంది. ఆ తర్వాత ఆయన చేరికల ప్రోగ్రాంలు నిర్వహిస్తారు. అప్పుడు మరింత వెల్లువ ఉండే అవకాశం ఉంది. గెలిచే పార్టీలో ఉండటం చాలా ముఖ్యమని ఎక్కువ మంది గట్టిగా నమ్ముతు్నారు.