వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిపోయారు. వారి క్యాడర్ను వారు తెచ్చుకున్నారు. ఆ ఇరవై మూడు నియోజకవర్గాల్లో ఉన్న టీడీపీ నేతలు వారి క్యాడర్ ను వారు పోషించుకుంటున్నారు. ఎన్నికలు దగ్గరకు వచ్చాయి. టిక్కెట్ తమకంటే తమకని రెండు వర్గాలుు పోటీ పడుతున్నాయి. అక్కడ టిక్కెట్ల పంచాయతీ తేల్చలేక చంద్రబాబు పదే పదే సమావేశాలు పెడుతున్నారు. కానీ తేలడం లేదు. కానీ ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా వలసలు ఉంటాయని జరుగుతున్న ప్రచారంతో.. టీడీపీలో మళ్లీ ఉక్కపోత ప్రారంభమయింది.
జిల్లాలలో వైసీపీ నుంచి వచ్చిన నేతలతో తెలుగుదేశం కార్యకర్తుల, నేతలు సర్ధుకుపోలేకపోతున్నారు. అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్ కే టిక్కెట్ దాదాపుగా ఖరారు చేశారు. కరణం బలరాం ఏం నిర్ణయం తీసుకుంటారోనన్న టెన్షన్ పార్టీలో ఉంది. జమ్మలమడుగులో రామసుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డిల్లో ఒకరికే అసెంబ్లీ టిక్కెట్. ఇంకొకరు ఏం చేస్తారో అంచనా వేయలేని పరిస్థితి. దాదాపుగా… పదిహేను నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఉంది. ఇప్పుడు కొత్తగా మళ్లీ వలసలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తెలుగుదేశంలో చేరతారని ప్రచారం జరుగుతోంది. వారిని పార్టీలో చేర్చుకుంటే కర్నూలు ఎంపీ, ఆయన భార్య సుజాతమ్మకు డోన్ టిక్కెట్ ఇవ్వాల్సిందే. డోన్ లో డిప్యూటీ సీఎం కేఈ సోదరుడు టిక్కెట్ ఆశిస్తున్నారు. కర్నూలు ఎంపీ టిక్కెట్ ను.. లోకేష్ ఇప్పటికే బుట్టా రేణుకకు ప్రకటించారు. వంగవీటి రాధా రేపో, మాపో తెలుగుదేశంలో చేరబోతున్నారు. సెంట్రల్ నియోజకవర్గంపైనే ఆయన దృష్టి ఉంటుంది. బొండా వర్గీయులు కలసి ఆయనతో నడవడం కష్టమే.
ఉత్తరాంధ్రలోనూ ఇలాంటి పొసగని పరిస్థితులు… ఉన్న నియోజకవర్గాలున్నాయి. రాజాం నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి వచ్చిన కొండ్రు మురళికి చాన్సిచ్చారు. అక్కడ టీడీపీకి మొదటి నుంచి ప్రతిభాభారతి ఉన్నారు. మురళికి టిక్కెట్ ఖాయం చేశారు. ప్రతిభాభారతి వర్గీయులు, మురళి అనుచరులతో కలిసి పనిచేయాల్సి ఉంది. ప్రకాశం జిల్లాలో కనిగిర నియోజకవర్గంలో బాలకృష్ణ మిత్రుడు కదిరి బాబూరావును తొలగించి ఉగ్రనరసింహారెడ్డికి టిక్కెట్ ఇవ్వాలని చంద్రబాబు అుకుటున్నారు. ముక్కు ఉగ్రనరపింహారెడ్డి ఇంకా పార్టీలో చేరలేదు. కానీ బాలకృష్ణ ఎలా స్పందిస్తారోనన్న ఉద్దేశంతో ఆగిపోయారు. ముందు ముందు వీటిపై నిర్ణయం తీసుకోక తప్పదు. అప్పుడు టీడీపీలో మరింత రచ్చ కాక తప్పదు.