దేశాన్ని చైతన్యవంతం చేయడానికే పుట్టినవాళ్ళమంటారు. ప్రజల కోసం కంటి మీద కునుకు లేకుండా పనిచేస్తున్నామంటారు. దేశాన్ని, ప్రజలను ఉద్ధరించడం కోసమే డే అండ్ నైట్ కష్టపడుతున్నామని అవకాశం దొరికినప్పుడల్లా డప్పేసుకుంటూ ఉంటారు.బట్… యాజ్ యూజువల్ మన లీడర్లు చెప్పే మాటలకు చేసే పనులకు అసలు పొంతనే ఉండట్లేదు.
నరేంద్రమోడీ వృద్ధనేత…నేను యువకుడిని అని బోలెడన్ని సభలలో మాట్లాడిన రాహుల్ గాంధీకి సాక్షాత్తూ లోక్ సభలో ఉండే చెయిరే పూలపాన్పులా కనిపిస్తుంది. ఓ వైపు కాంగ్రెస్ పార్టీనేమో ఈయనను కాబోయే ప్రధాని అని ప్రచారం చేయడానికి నానా తంటాలూ పడుతూ ఉంటుంది. కానీ శ్రీమాన్ రాహుల్గారేమో గవర్నెమెంట్ ఆఫీసులో ఎంప్లాయిలాగా పార్లమెంట్లో నిద్రపోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. విద్యార్థులతో ముఖాముఖి క్యార్యక్రమాలలో చాలా సార్లు, చాలా విషయాలపైన సమర్థవంతంగా మాట్లాడలేకపోయారు రాహుల్ గాంధీ. రామ్ గోపాల్ వర్మ సినిమాలో కోట శ్రీనివాసరావులాగా ‘నేను ఖండిస్తున్నా’ లాంటి మాటలతో కవర్ చేసుకున్నాడు. విషయంపైన అవగాహన లేనివాళ్ళకు ఎంత గొప్ప స్పీచ్ అయితే మాత్రం ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది? అందుకే రాహుల్ గాంధీకి కూడా పుస్తకం చేతిలోకి తీసుకోగానే నిద్ర ముంచుకొచ్చే బ్యాక్ లాగ్ స్టూడెంట్‌కి మల్లే మత్తు ముంచుకొచ్చేసేలా ఉంది.
ఒక్క రాహుల్ గాంధీనే కాదు ఆ బాపతు నేతలు ఇంకా బోలెడు మంది ఉన్నారు. ఆ మధ్య కాలంలో కుర్చీల కొట్లాటలో లక్కీగా ప్రధాని పదవి కొట్టేసిన దేవెగౌడ కూడా తన నిద్రతోనే చాలా పాపులారిటీ తెచ్చుకున్నాడు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోడీ, జాతినుద్ధేశించి ప్రసంగిస్తూ ఉంటే కూడా మన నాయకులు ఎంచక్కా కునుకు తీసేశారు. వాళ్ళలో మోడీ పేరెత్తితేనే ఒంటికాలి మీద లేచే కేజ్రీవాల్ కూడా ఉన్నారు. మోడీ మాట కేజ్రీవాల్‌కి జోలపాటలా వినిపించడం ఆశ్ఛర్యకరమే. కేజ్రీవాల్ ఒక్కడే కాదు అరుణ్ జైట్లీ, మనోహర్ పారికర్‌లు కూడా ఓ నిద్రేశారు. తమ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పైన ఎక్కడ విమర్శలు వస్తాయో అని అలర్ట్ అయిన ఆప్ నేత, ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా వెంటనే ఎదురుదాడికి దిగేశాడు. మోడీ ప్రసంగం బోర్ కొట్టిందని ట్విట్టర్లో స్పందించారు.
అర్రె…..మనీష్ భాయ్…బాగా లేటయ్యారు. ‘నా ప్రసంగంలో ఏమి ఉండాలో మీరే చెప్పండి’ అని మోడీ అందరినీ అడిగాడుగా….. అప్పుడే మీలాంటి మేధావులందరూ కూడా చెప్పి ఉండాల్సింది. రాఖీ సావంత్ లాంటి వాళ్ళ చేత ఓ ఐటెం సాంగ్, రికార్డింగ్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా అరేంజ్ చేయాలి అని డిమాండ్ చేసి ఉండాల్సింది. అప్పుడైతే ఎవ్వరికీ నిద్దర్లు పట్టేవి కాదుగా.