తెలుగు ప్రజలు వైసీపీని భూస్థాపితం చేశారు. చరిత్రలో కొమ్ములొచ్చిన నియంతలకు ఎలాంటి దుస్థితి పట్టిందో జగన్ మోహన్ రెడ్డికి కూడా అలాంటి గతి పట్టించారు. వైసీపీ ఈ స్థాయిలో పతనమైపోవడానికి కారణాల్లో.. ఆ పార్టీ నాయకులు వాడిన పరుషమైన భాష ఒకటి. అక్షరాలు, పదాలు, మాటలు సిగ్గుపడే భాషని ఈ ఐదేళ్ళలో ప్రయోగించారు వైసీపీ నాయకులు. మంత్రుల స్థాయిలో వున్న నాయకులు కూడా లకారాలు, పత్రికల్లో రాయలేని, టీవీల్లో చూడలేని మాటలు వాడారు. ఈ ఐదేళ్ళల్లో వైసీపీ నాయకులు మాట్లాడినన్ని అన్ పార్లమెంటరీ మాటలు చరిత్రలో ఏ రాజకీయ పార్టీ ఆడి వుండదు.
అసెంబ్లీ వేదికలలో ఓ కల్లు కాంపౌండ్ లో మాట్లాడిన మాటలు కంటే హీనమైన మాటలు, వ్యక్తిగత దూషణలు చేశారు వైసిపీ నాయకులు. గూండాలు, రౌడీలు కంటే దారుణంగా ప్రవర్తించారు. సభలో లేని వ్యక్తులు ప్రస్తావన తీసుకొచ్చి, మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా అత్యంత దారుణంగా వ్యవహరించారు. ప్రజలు అధికారం ఇచ్చింది కేవలం ఎదుటవారిపై దాడి చేయడానికే అన్నట్లు క్రూరంగా ప్రవర్తించారు.
ఇక సోషల్ మీడియాలో అయితే వైసీపీ నాయకులు, కార్యకర్తల దుర్మార్గానికి అంతులేదు. సోషల్ మీడియాని బూతులు తిట్టుకునే వైల్డ్ ఫాంటసీ ఫ్లాట్ ఫార్మ్ గా వాడుకుంది వైసీపీ. లకారం తప్పితే మరో మాట వుండదు వైసీపీ హ్యండిల్స్ లో. చివరికి వైసీపీ ఏ స్థాయికి దిగజారిందంటే.. వైఎస్ షర్మిల పుట్టుకని కూడా ప్రశ్నిస్తూ వెకిలి పోస్టులు పెట్టింది. ఇంతదారుణం జరుగుతున్నా ముఖ్యమంత్రి స్థానంలో వున్న జగన్ మోహన్ రెడ్డి కనీసం అన్న స్థానంలో ఆలోచించి ఆ దుర్మార్గానికి అడ్డుకట్టవేయలేకపోయాడు.
అయితే అన్నిటికంటే అధికారం ఇచ్చిన ప్రజలు గొప్పోళ్ళు. ఈ ఐదేళ్ళలో వైసీపీ నాయకులు వాడుతున్న భాషని ఓ కంటకనిపెడుతూ వచ్చారు. ఏ అధికారం చూసి వైసీపీ విర్రవీగిందో ఆ ధికారాన్ని కూకటివేళ్ళతో సహా దూరం చేశారు.
‘నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది’. వైసిపీలో వొక్కడంటే ఒక్క నాయకుడు కూడా ఈ హితోక్తిని పాటించలేదు. నీచమైన మాటలతో దాడి చేయడమే పరమావధిగా పెట్టుకున్నారు. అంతిమంగా తగిన ఫలితం పొందారు.
ఇప్పుడు అధికారం చేపట్టిన నాయకులు పైన ప్రస్థావించిన హితోక్తిని తూచ తప్పకుండా పాటించాలి. ఎంత ఆగ్రహం వచ్చిన సందర్భమైన పరుష పదజాలం జోలికి వెళ్ళకూడదు. మీడియాని అడ్రస్ చేసినప్పుడు మరింత జాగ్రత్తగా వుండాలి. ప్రజలు ప్రతిది గమనిస్తారనే స్పృహతో మాట్లాడాలి. ఎన్ని కవ్వింపు చర్యలు పాల్పడిన సహనం కోల్పోకూడదు. రాజకీయాల్లో అధికారం ఎప్పుడూ ఒకరి చేతిలో వుండదు. అయితే అధికారం అవకాశం వచ్చినప్పుడు వీలైనన్ని మంచి పనులు, మంచి మాటలతో అందరినీ కలుపుకుంటూ పొతే ప్రజల మనసులో పదికాలాలు పదిలంగా వుంటారనే సత్యాన్ని గ్రహించాలి.