తెలంగాణ అసెంబ్లీలో, బయట దానం నాగేందర్, కౌశిక్ రెడ్డి వంటి ఎమ్మెల్యేలు మాట్లాడిన బాషను విన్న ప్రజలు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఏపీలో ఐదేళ్ల పాటు ఇదే భాష విచ్చలవిడిగా వినిపించింది. అలాంటి నేతలకు.. ఆ భాషను ప్రోత్సహించిన పార్టీకి అక్కడి ప్రజలు గట్టి షాక్ ఇచ్చారు. బూతు నేతలందరికీ పోలింగ్ బూత్ లోనే సమాధానం చెప్పారు. ఈ గుణపాఠాన్ని నేర్చుకోవడంలో తెలంగాణ నేతలు విఫలమయ్యారని పెరుగుతున్న విష భాషా సంస్కృతి నిరూపిస్తోది.
తెలంగాణ అసెంబ్లీలో దానం నాగేందర్ బీఆర్ఎస్ సభ్యులపై చేసిన వ్యాఖ్యలు బెదిరింపులు ఏపీలో కొంత మంది వైసీపీ నేతల్ని గుర్తుకు తెచ్చాయి. వైసీపీ హయాంలో ఏపీ అసెంబ్లీలో మాత్రమే చూసిన లాంగ్వేజ్ ను ఆయన తెలంగాణ అసెంబ్లీకి తీసుకు వచ్చారన్న విమర్శలు వచ్చాయి. కాంగ్రెస్ లోనే కాదు.. బీఆర్ఎస్ లోనూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యవహారం వివాదాస్పదంగా ఉంది. ఆయన మహిళా నేతలపై తరచూ అనుచిత వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. సాక్షాత్తూ అసెంబ్లీలోనే సీతక్కపై అనుచితంగా మాట్లాడినట్లుగా విమర్శలు ఎదుర్కొన్నారు. అంతకు ముందు గవర్నర్ గా ఉన్న తమిళిశై సౌందరరాజన్‌పై అత్యంత అసభ్యకరంగా ఆయన చేసిన వ్యాఖ్యలు జాతీయ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి.
ఏపీలో ఐదేళ్ల కాలంలో రాజకీయ భాష ఎంత దిగజారిపోవాలో అంత దిగజారిపోయింది. అసెంబ్లీలోనే కాదు.. బయట కూడా అత్యంత ఘోరంగా తిట్టుకున్నారు. మహిళా నేత రోజా కూడా తీసిపోలేదు. ఇలా వారి భాష వినీ వినీ చిరాకు పడిన ప్రజలు ఆ బూతు నెతలు ఎవర్నీ మరోసారి అసెంబ్లీకి పంపించలేదు. అత్యంత ఘోరంగా ఓడించారు. బూతు నేతలందరికీ పోలింగ్ బూతుల్లోనే సమాధానం చెప్పారు. ఎన్నికల ఫలితాల తర్వాత వారెవరూ బహిరంగంగా కనిపించడం లేదు. అంతా ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వారి నిర్వాకం కారణంగా వారి పార్టీ కూడా ఘోరంగా ఓడిపోయింది. ఇప్పుడు తమ పార్టీలకూ అదే గతి పట్టించేందుకు తెలంగాణ నేతలు సిద్దమవుతున్నట్లుగా ఉన్నారు.