టీఎస్పీఎస్సీ లీక్ వ్యవహారాన్ని రాజకీయ రంగు పులమడానికి బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అసలు విషయాల కన్నా కొసరు విషయాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. రాజకీయ ఆరోపణలకు సిట్ కేసులు పెట్టించే ప్రయత్నం చేస్తున్నారు. గురువారం రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన సిట్ శుక్రవారం బండి సంజయ్ ను విచారించనున్నారు. ఆ తర్వాత వారిపై కేసులు పెడతారన్న ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో కేటీఆర్ కూడా వారిద్దరికీ లీగల్ నోటీసులు జారీ చేశారు.
రాజకీయాల్లో ఆరోపణలు సాధరణం. అంతకు మించి చేసుకుంటూ ఉంటారు. ఎదురుదాడి కూడా రాజకీయంగానే ఉంటుంది. కానీ ఈ సారి కేటీఆర్ మాత్రం తనపై ఆరోపణలు చేయకుండా కేసులు పెట్టించాలనుకుంటున్నారు. దీంతో ఈ పేపర్ లీకేజీ వ్యవహారం మొత్తం రాజకీయం అవుతోంది. అయితే ఇది వ్యూహాత్మకంగానే చేస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. పేపర్ లీకేజీ అసలు ఎప్పట్నుంచి జరుగుతోందన్న వివరాలు బయటకు తెలిస్తే.. నిరుద్యోగుల్లో అసహనం పెరిగిపోతుందని… తాము మోసపోయామని అనుకుంటారని దాని కన్నా రాజకీయ మసి పూస్తే టాపిక్ డైవర్ట్ అవుతుందని భావిస్తున్నారని అంటున్నారు.
ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన టీఎస్పీఎస్సీ ఉద్యోగాల భర్తీ ఇప్పుడు డొలాయమానంలో పడింది. ఒక్క ప్రశ్నాపత్రం కూడా లీక్ కాలేదని అనుకునే పరిస్థితి లేకుండా పోయింది. అసలు కాన్ఫిడెన్షియల్ కంప్యూటర్ మొత్తం హ్యాక్ అయిందని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పరీక్షలు పెట్టినా యువత నమ్మరు. ఇప్పుడల్లా ఉద్యోగ పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేదు. అందుకే బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందంటున్నారు. కానీ ఇది రెండు విధాలుగా నష్టం చేస్తుందని.. యువత లో ఆగ్రహాన్ని పెంచుతుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.