అదేంటో గాని… ఆంధ్రప్రదేశ్లో ఫిరాయించిన 23 మంది ఎమ్మెల్యేలలో ఎవరకూ రాని తలనొప్పులు పాడేరు ఎమ్మెల్యేకి మాత్రమే వస్తున్నాయి. ఎన్నికలకు కేవలం ఏడాదికి కాస్త అటూ ఇటూగా మాత్రమే సమయం ఉన్న పరిస్థితుల్లో… ఇక తప్పనిసరి పరిస్థితుల్లో… నిజానికి అరకొర మనసుతోనే ఆమె పార్టీ ఫిరాయించారు. అందుకు తగ్గట్టే ఆమెకు అనుకోని సమస్యలూ చుట్టుముడుతున్నాయి.
ఏజెన్సీ ప్రాంతంలో వైసీపికి ఏకైక చెప్పుకోదగ్గ నేతగా ఉన్న పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పార్టీ కోసం బాగానే కష్టపడ్డారని చెప్పాలి. ఈ నేపధ్యంలో తన టిక్కెట్ మాత్రమే కాకుండా తను సూచించిన వ్యక్తికే అరకు టిక్కెట్ వస్తుందనే భరోసాతో ఆమె చాలా కాలంగా ఉన్నారు. అందకు తగ్గట్టే ఆమెకు జగన్ బాగా ప్రాధాన్యం కూడా ఇచ్చారు. వీటన్నింటి నేపధ్యంలో గిడ్డి ఈశ్వరి పార్టీ మారడం అనగానే చాలా మంది అది జరగబోదనే అనుకున్నారు. ఏమైతేనేం…తాను ఆశించింది జరగడం లేదని తెలిసి, ఇక తప్పనిసరి పరిస్థితుల్లో టీడీపీలోకి జంప్ అయ్యారు గిడ్డి ఈశ్వరి.
పార్టీ మారిన తర్వాత కూడా జగన్ అన్న అంటే ప్రాణం, ఆయనతో తన అనుబంధం చాలా గట్టిది వచ్చే ఎన్నికల్లో అరకు, పాడేరులలో వైసీపీయే గెలుస్తుంది వంటి మాటలు మాట్లాడడం ద్వారా అటు తమ కొత్త పార్టీ నేత చంద్రబాబు ఆగ్రహానికి గురయ్యారు. తర్వాత అసెంబ్లీలో బాబును పొగిడి కొంత వరకూ ఆయన అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేశారు.
మరోవైపు వైసీపీ మాత్రం ఆమె పార్టీ మారిన తర్వాతి మాటల్ని ఆయుధాలుగా ఉపయోగించుకుంటూనే ఆమె రూ.25 కోట్లకు అమ్ముడుపోయారంటూ ప్రచారం చేసుకుంటూ వచ్చింది. అంతేకాదు తాజాగా ఆమె పార్టీ మారేందుకు నిర్వహించిన కార్యకర్తల సమావేశం వీడియోను బయటపెట్టడం ద్వారా ఈశ్వరిని మరింత ఇరుకునబెట్టింది.
తనకు చంద్రబాబు అంటే ఇష్టం లేకపోయినా, తెలుగుదేశం పార్టీలో చేరితే మరో నెల, రెణ్నెళ్లలో జరిగే మంత్రి వర్గ విస్తరణలో తనను తీసుకుంటానన్నారని, అది కుదరకపోతే కనీసం ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ పదవైనా తప్పకుండా ఇస్తానని హామీ లభించినట్టు ఆ సమావేశంలో ఈశ్వరి కార్యకర్తలకు నచ్చజెప్పడం కనిపించింది. అదే విధంగా అధికారపార్టీలో చేరడం ద్వారా తాను ఆశిస్తున్న అంచనావేస్తున్న పలు ప్రయోజనాలను ఆమె కార్యకర్తలకు విడమరిచి చెప్పారు.
ఈ వీడియో ఇప్పుడు వైసీపీకి ఆయుధంగా మారింది. గురువారం పలు చానెళ్లలో ఈ వీడియో ప్రసారం కావడంతో ఈశ్వరి ఖంగుతిన్నట్టు కనిపించారు. విలేకరుల సమావేశం పెట్టి దీన్ని ఖండించారు. తానేమీ తప్పు మాట్లాడలేదని, జగన్ సిఎం అవుదామని అనుకున్నట్టే తాను మంత్రి అవుదామనుకోవడం తప్పా అని ప్రశ్నించారు. పార్టీ మారినందుకు తనను ఇంతగా మనోవేదనకు గురి చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తనపైన దుష్ప్రచారం చేస్తున్న జగన్పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేస్ వేస్తానంటూ ఆమె హెచ్చరించారు.