ఏపీలో అధికార దుర్వినియోగం చేయలేక.. చేస్తే ఉద్యోగం ఊడుతుందన్న భయంతో సెలవు పెట్టి వెళ్లి పోవడం మంచిదన్నభావనలో చాలా మంది రిటర్నింగ్ ఆఫీసర్లు ఉన్నారు. తమకు సెలవు ఇప్పించాలని సీనియర్ అధికారులకు ఆర్వో బాధ్యతలు ఇవ్వాలని కోరుతూ కనీసం ఇరవై మంది ఆర్వోలు సీఈవో మీనాకు విజ్ఞప్తి చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
లీవ్ లెటర్లతో వస్తున్న ఆర్వోలను సీఈవో మీనా బుజ్జగిస్తున్నారు. తాము చూసుకుంటామని ధైర్యంగా ఉండాలని చెబుతున్నారు. కానీ తాడిపత్రి రిటర్నింగ్ అధికారి రాంభూపాల్ రెడ్డిని మాత్రం సముదాయించలేకపోయారు. తన వల్ల కాదని ఆయన తేల్చేయడంతో సెలవు ఇచ్చేశారు. తాడిపత్రి ఘటనలపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ విషయంలో ఆయనపై తీవ్ర ఒత్తిడి ఉండటంతో తనను ఎన్నికల డ్యూటీ నుంచి తప్పించాలని తనకు ఆరోగ్యం బాగాలేదని ఆయన పట్టుబట్టడంతో సెలవు ఇవ్వక తప్పలేదు.
కౌంటింగ్ సమయంలోనూ అనేక వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. వాటిని తట్టుకోవడం కష్టమని ఎక్కువ మంది ఆర్వోలు భావిస్తున్నారు. రాష్ట్రంలో ప్రభత్వం మారినా మారకపోయినా.. గొడవలు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. గొడవలు జరిగే అవకాశం ఉన్న ప్రత చోటా బలగాలను మోహరించింది. ఫలితాలు వచ్చిన రెండు వారాల వరకూ భద్రత ఉంటుందని చెబుతున్నారు. అయితే ఈ బాధ్యత అంతా రిటర్నింగ్ అధికారులే చూసుకోవాల్సి ఉంటుంది. కఠినంగా వ్యవహరిస్తే తర్వాత అధికారంలోకి వచ్చే వారు వేధిస్తారన్న అనుమానాలు కూడా ఉన్నాయి.