కేంద్ర బడ్జెట్‌పై అసంతృప్తి ఆవేదన అంటూనే బిజెపి కూటమిలో కొనసాగడానికి పాలక టిడిపి సిద్ధమై పోయింది. ముఖ్యమంత్రి ఎంపిలతో జరిపేచర్చలలోనూ మరో పదిరోజుల పాటు రాయబారాలు సంప్రదింపులు జరపాలనే సూచన రాబోతున్నట్టు గట్టిగా చెప్పొచ్చు. ఎందుకంటే ఆగ్రహం తెగతెంపులు వంటివి చేసేట్టయితే ఆ పరిస్థితి వేరుగా వుండేది. ఇప్పుడు కాస్త తీవ్రమైన స్పందనలు వెల్లడించి ఆ పైన సర్దుబాటు చేసుకుందామని భావిస్తున్నారు. మరోవైపున ప్రధాన ప్రతిపక్షం వైసీపీ ఈ మాత్రం శ్రమ కూడా తీసుకోదలచలేదు. ప్రతిపక్ష నేత జగన్ బడ్జెట్‌పై సంపూర్ణ స్పందనే వెల్లడించలేదు.పాదయాత్ర అనుకుంటే శుక్రవారం కేసుకోసం హైదరాబాద్ రానే వచ్చారు. కాబట్టి కావాలనే నిరసన చెప్పకుండా దాటేశారన్నమాట. పైగా సాక్షిలో బడ్జెట్‌ను బ్రహ్మాండంగా ప్రొజెక్టు చేశారు. నెల్లూరు పర్యటనలో భాగంగా మాట్టాడిన జగన్ కేంద్రం ఇవ్వనందుకు ఏమీ అనకుండా చంద్రబాబు ప్రభుత్వం తెచ్చుకోలేకపోయిందని దానిపైనే దాడి కేంద్రీకరించడం అసంబద్దంగా వుంది. కేసులకు సంబంధించిన సమస్యలతో బిజెపిని విమర్శించడానికి ఆయన వెనుకాడుతున్నారనేది స్పష్టమై పోయింది. గత నెలలో 117 కోట్ల మేరకు క్విడ్ ప్రో కో సంస్థల ఆస్తులు స్వాధీనం చేసుకున్న ఈడి చర్యకు తోడు శుక్రవారం నాడు సిబిఐ విజయసాయి రెడ్డి పిటిషన్‌ను తోసిపుచ్చాలని వాదించింది. వైఎస్ ప్రభుత్వం వల్ల మేళ్లు పొందన వారే పెట్టుబడులు పెట్టారని తేల్చి పారేసింది. జగన్ కేసులపై కేంద్రం మెతగ్గా వుండబోదని ఈ పరిణామాలు వెల్లడించడంతో జగన్ దూకుడు తగ్గినట్టే కనిపిస్తుంది. మొక్కుబడిగా కేంద్రం పేరు ప్రస్తావించిడమే తప్ప ఆయన దాడి యావత్తూ చంద్రబాబుపైన టిడిపిపైన కేంద్రీకృతమవుతున్నది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పరిస్థితి తీవ్రతకు తగినట్టే స్పందించడంలో విఫలమైనారు.
పాలక ప్రతిపక్ష పార్టీలూ ఇలా పోట్లాడుకుంటూ వుంటే వామపక్షాలు 8వ తేదీన బంద్ జరపాలని ఏకగ్రీవంగా పిలుపునిచ్చాయి. ఈ పిలుపును కాంగ్రెస్ అద్యక్షుడు రఘువీరారెడ్డి బలపర్చారు. మిగిలిన వారు ఏం చేస్తారో తెలియదు గాని ఇలాటి పోరాటం జరగాలని మాత్రం ప్రజలు కోరుకుంటున్నారు. రాజకీయ పార్టీలూ బంద్‌కు ఏదో విధంగా మద్దతు తెలిపే పరిస్థితి రావచ్చు.