‘పవన్ కల్యాణ్ బాగానే రాజకీయాలు చేస్తున్నారు, కానీ సినిమాటిక్ గా చేస్తున్నారు’- వామపక్షాలకు చెందిన ఒక ముఖ్యనేత తాజాగా ఆఫ్ ద రికార్డ్ ఈ మాట చెప్పినట్టు తెలుస్తోంది! ఎన్నికలకు దగ్గరపడుతూ ఉండటంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా జోరు పెంచిన సంగతి తెలిసిందే. మిగతా పార్టీల కంటే ముందుగా ఆయనే అభ్యర్థుల ప్రకటన చేశారు. ఇతర పార్టీల కంటే తామే ఎన్నికలకు ముందుగా సంసిద్ధంగా ఉన్నామనే సంకేతాలు ఇచ్చారు. అదే ఊపులో అనూహ్యంగా లక్నో వెళ్లిపోవడం, అక్కడ బీఎస్పీ అధినేత్రి మాయావతితో భేటీ కావడం జరిగిపోయాయి. మాయావతి ప్రధాని అయితే బాగుంటుందని పవన్ అభిప్రాయపడితే, పవన్ లాంటి నాయకులు ముఖ్యమంత్రి కావాలంటూ ఆమె అన్నారు!
అయితే, ఈ మధ్య వరుసగా జనసేనలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై మిత్రపక్షాలైన వామపక్షాలు కొంత అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. బహిరంగంగా నేతలు మాట్లాడకపోయినా… టిక్కెట్ల ప్రకటనపై మదనపడుతున్నట్టు తెలుస్తోంది. మొదట్నుంచీ తమతో పొత్తు పెట్టుకున్నామని పవన్ అంటున్నప్పుడు, తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అభ్యర్థుల ప్రకటన చేయడం ఏంటనే చర్చ వామపక్షాల్లో జరుగుతున్నట్టు తెలుస్తోంది. మాయావతితో పవన్ భేటీ, బీఎస్పీతో ఏపీలో పొత్తు అంశంపై కూడా వారి స్పందన దాదాపు ఇలాంటిదే ఉందని సమాచారం. ఆయన లక్నో వెళ్తారనిగానీ, బీఎస్పీతో పొత్తు పెట్టుకుంటారనిగానీ తమకు ముందుగా ఎలాంటి సమాచారమూ లేదని లెఫ్ట్ నేతల వాపోతున్న పరిస్థితి ఉందట!
మాయావతితో పవన్ పొత్తు నేపథ్యంలో వామపక్షాల అంతర్మథనం ఏంటంటే… ఏపీలో తాము పోటీకి దిగుదామనుకుంటున్న ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల విషయంలో ఏదైనా మార్పు వస్తుందా అనేది! తాము కోరుతున్న స్థానాలనే బీఎస్పీ కూడా అడిగితే పవన్ స్పందన ఎలా ఉంటుందో వారికి అంచనాకు దొరకని పరిస్థితి. అయితే, బీఎస్పీతో జనసేన సీట్ల సర్దుబాటు ఎలా ఉంటుందనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మాయావతి, పవన్ కల్యాణ్ లు మరోసారి భేటీ అయ్యాక నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరి, ఈలోగానైనా పవన్ తమతో బీఎస్పీతో పొత్తు విషయం చెబుతారా, చర్చలకు పిలుస్తారా, సమష్టిగా నిర్ణయం తీసుకుంటారా అనేది ప్రశ్నలకు ప్రస్తుతం వామపక్షాల దగ్గరైతే సమాధానం లేదనే చెప్పాలి. పవన్ తో రాజకీయ ప్రయాణంలో ట్విస్టులు ఎక్కువ ఉంటాయనేది వామపక్షాలకు ఇప్పుడు అర్థమౌతున్నట్టుగా ఉంది.