వరంగల్ ఎన్కౌంటర్ కి నిరసనగా తెలంగాణాలోని వివిధ ప్రజా సంఘాలు, వామ పక్షాలు కలిసి తెలంగాణా ప్రజాస్వామిక వేదిక నేతృత్వంలో ఈరోజు ‘ఛలో అసెంబ్లీ’ పేరిట అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. కానీ ప్రస్తుతం రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా కారణంగా వారి కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినప్పటికీ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపట్టేందుకు వామపక్షాలు సిద్దపడుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా నేతల అరెస్టులు కొనసాగుతున్నాయి. నిన్న అర్ధరాత్రి పోలీసులు నిజాం కాలేజీ, ఉస్మానియా విశ్వవిద్యాలయ హాస్టళ్ళలో తనికీలు నిర్వహించి కొందరు విద్యార్ధులను అదుపులోకి తీసుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య కూడా వామపక్షాలకు మద్దతు ప్రకటించడంతో పోలీసులు ఆయనను కూడా గృహ నిర్భందం చేసారు. నగరంలోకి ప్రవేశించే అన్ని మార్గాలలో పోలీసులు తాత్కాలిక చెక్ పోస్టులు ఏర్పాటు చేసి నగరంలోకి వస్తున్న వాహనాలను తనికీలు చేసిన తరువాతనే లోపలకి ప్రవేశించేందుకు అనుమతిస్తున్నారు.
తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా ఇటువంటి పరిస్థితి ఎదురవుతుందని తామెన్నడూ ఊహించలేక పోయామని ప్రజా సంఘాల నేతలు అంటున్నారు. ఒకానొకప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి పరిపాలన ఏవిధంగా ఉందో కేసీఆర్ పరిపాలన కూడా ఇప్పుడు అలాగే సాగుతోందని అభిప్రాయం వ్యక్తం చేసారు. శాంతియుతంగా చేపడుతున్న తమ కార్యక్రమాన్ని అడ్డుకొనేందుకు తెలంగాణా ప్రభుత్వం ఇన్ని వేలమంది పోలీసులను ఉపయోగించడాన్ని వారు తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా తాము ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టి తీరుతామని విరసం నేత వరవరరావు అన్నారు.