అయిదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ప్రకటనతో దేశ రాజకీయాల్లో కొత్త అంకం మొదలవుతుంది. 2014 ఎన్నికల్లో తొలిసారిగా స్వంతంగా మెజార్టి పొందిన బిజెపికి అందులోనూ ప్రధాని నరేంద్ర మోడీ రాజకీయ భవితవ్యానికి ఇది పెద్ద పరీక్షే. అదే సమయంలో వామపక్షాలకు కూడా ఇది చాలా కీలక పోరాటం. ఎందుకంటే కేరళ పశ్చిమ బెంగాల్ దేశంలోనే కమ్యూనిస్టు కంచుకోటలుగా పేరొందాయి. జెఎన్‌యు ఘటనలను అంత పెద్దవి చేయడంలో కేంద్రం ఉద్దేశం వామపక్ష రాష్ట్రాలను ప్రభావితం చేయడమే.
దేశానికి తొల్టి కాంగ్రెసేతర కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని అందించిన కేరళలో కాంగ్రెస్ మొదటినుంచి కుల మత రాజకీయాలను ప్రోత్సహించి చిన్న చిన్న పార్టీలను ఏర్పాటు చేయించింది. అందుకే అక్కడ ఎవరికీ పూర్తి మెజార్టీ వచ్చే అవకాశం వుండదు. సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎప్, కాంగ్రెస్ నాయకత్వంలోని యుడిఎప్ ఒకదాని తర్వాత మరొకటి అధికారంలోకి వస్తుంటాయి. గతసారి మాత్రం ఎల్‌డిఎప్ ఈ వరవడిని ఛేదిస్తూ రెండోసారి కూడా అధికారానికి చేరువగా వచ్చి ఓడిపోయింది. ముఖ్యమంత్రి అచ్యుతానందన్‌పై ప్రజల విశ్వాసం ఈ ప్రత్యేక పరిస్థితికి ఒక ప్రధాన కారణమైంది. తొంభై ఏళ్లు పైబడిన వయస్సులోనూ చురుగ్గా తిరుగుతూ నీతి నిజాయితీలకు మారుపేరుగా నిలబడిన అచ్యుతానందన్‌ను ి అక్కడ అత్యున్నత నేతగాచూస్తుంటారు. సిపిఎంలో తీవ్ర స్థాయిలోనే అంతర్గత సమస్యలు బహిరంగ కథనాలు వచ్చినా అంతర్గతంగా పరిష్కారం చేసుకుని ప్రత్యర్థులను ఎదుర్కోవడం ఉద్యమాన్ని రక్షించుకోవడం జరగుతూనే వుంది. తెల్లిచ్చేరి వంటిచోట్ల ఆరెస్సెస్ సిపిఎం సంఘర్షణలు ఉద్రిక్తత పెంచుతున్నా మోడీ ప్రచారార్బాటంలో కూడా కేరళలో వామపక్షాలు నిలబడ్డాయి. యుడిఎప్ ముఖ్యమంత్రి వూమెన్ చాందీ వరుస కుంభకోణాలలో కూరుకుపోవడమే గాక వ్యక్తిగతంగానూ ఆరోపణల పాలై ప్రతిష్ట కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఎల్‌డిఎప్ అక్కడ విజయం సాధిస్తుందనే విషయమై ఎవరికీ సందేహాలు లేవు. బిజెపి శాసనసభలో ప్రాతినిధ్యం పొందుతుందా ఓట్ల శాతం పెంచుకుంటుందా వంటి లెక్కలు కొందరు వేస్తున్నారు. తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో బిజెపి 32 మందిని గెలిపించుకోవడం, కొన్ని పంచాయతీలు గెలవడం ఆధారంగా ఈ లెక్కలు వేస్తున్నారు గాని అసెంబ్లీ ఎన్నికల్లో అవన్నీ అక్కరకు వచ్చేవి కావు. ఇక సిపిఎంనుంచి అచ్యుతానందన్ పోటీలో వుంటారా లేదా అనేదానిపై ఎక్కువ కథనాలు నడుస్తున్నాయి. వయోభారం ఎన్నికల పోటీకి కొలబద్ద కాదని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వ్యాఖ్యానించారు. దీనిపై తుది నిర్ణయం సిపిఎం రాష్ట్ర కమిటీ తీసుకోవలసి వున్నా ఆయన ప్రచారంలో అగ్రభాగాన వుంటారనడంలో ఎలాటి సందేహాలు లేవు. 2009,2014 ఎన్నికల్లో దెబ్బతిన్న సిపిఎంకు కేరళ ఫలితాలు గొప్ప వూరట నివ్వడం ఖాయమనే పరిశీలకులు భావిస్తున్నారు. వామపక్షాల పునరుజ్జీవ క్రమంలో కేరళ ఎన్నికలు ముఖ్య పాత్ర పోషించనున్నాయి. కేరళ శాసనసభలో మొత్తం 140 స్థానాలుంటే గతసారి సిపిఎం 45, కాంగ్రెస్ 38, ఐయుఎంఎల్ 20, సిపిఐ 13, కేరళ కాంగ్రెస్ మణి 9, జనతా దళ్ సెక్యులర్ 4, ఇండి 2, ఇతరులు 9 తెచ్చుకున్నాయి.
కేరళ కన్నా భీకరమైన పోటీ పశ్చిమబెంగాల్లో జరగనుంది. ఇందిరాగాంధీ నిరంకుశ పాలనను ఎదుర్కొని పోరాడటం, ఆ తర్వాత 34 ఏళ్ల వామపక్ష ప్రభుత్వ పాలన బెంగాల్‌కు దేశంలోనే ప్రత్యేకత తెచ్చిపెట్టాయి. అలాటి చోట 2011లో ఓడిపోవడం కమ్యూనిస్టులతో పాటు ఇతర అభ్యుదయ శక్తులకూ చాలా నిరుత్సాహం కలిగించింది. అన్ని విజయాల తర్వాత ఒకసారి ఎన్నికల పోరాటంలో ఓడిపోవడం అసాధారణం కాదు గాని ఈ ఓటమికి దారితీసిన పరిస్థితులు చాలా చర్చకు దారితీశాయి. దీర్ఘకాలం అధికారంలో వున్న వామపక్ష ప్రభుత్వ భూసంస్కరణలు తదితర శ్రేయో విధానాలు మన్నన పొందాయి గనకే అన్నిసార్లు విజయపరంపరలు సాధించగలిగింది. జ్యోతిబాసుపై ప్రజల అభిమానం ఆయన పాలనా దక్షత కూడా అందుకు దోహదం చేశాయి. ఆ తర్వాత బుద్ధదేవ్ అధికారం చేపట్టాక చివరి సంవత్సరాలలో కొన్ని పొరబాట్లు జరిగాయని సిపిఎం కూడా అంగీకరించింది. అయితే దాంతోపాటు అవిచ్చిన్నంగా కొనసాగుతున్న తమ ప్రభుత్వాన్ని ఎలాగైనా కూలగొట్టాలని మమతా బెనర్జీ నుంచి మావోయిస్టుల వరకూ, కాంగ్రెస్ నుంచి కాషాయకూటమి వరకూ ఏదో ఒక రూపంలో చేతులు కలపడం అంతర్జాతీయ పెట్టుబడులు కూడా అండగా నిలవడం జరిగిందని కూడా సిపిఎం భావిస్తున్నది. శారదా చిట్‌ఫండ్ కుంభకోణం వెలుగు చూశాక రకరకాల శక్తులు ఎలా చేతులు కలిపాయో మీడియాను ఎలా వుపయోగించుకున్నాయో కొన్ని కొత్త కోణాలు బయిటపడ్డాయి. ఇక గెలిచిన తర్వాత మమత తన వెంట నిలిచిన మావోయిస్టులను కూడా మట్టుపెట్టడంపై కేంద్రీకరించడం ఒక గుణపాఠం. సిపిఎం కార్యకర్తలపై దాడులు హత్యలు చాలా జరిగాయి. ఒకప్పటి దాని మిత్రపక్షం కాంగ్రెస్ కూడా ఈ దౌర్జన్యానికి గురి కావలసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే సిపిఎం కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటుందనే ప్రచారం సాగింది. దానిపై చర్చ కూడా నడదిచింది. చివరకు తృణమూల్ బీభత్స పాలనకు వ్యతిరేకంగా కలసి వచ్చేప్రజాస్వామిక శక్తులతో చేతులు కలిపి ఆ ప్రభుత్వాన్ని గద్దెదించాలని సిపిఎం నిర్ణయించింది. కాంగ్రెస్‌తో పొత్తు లేదా అవగాహన అవకాశం లేదని సిపిఎం కేంద్ర నాయకత్వం స్పష్టం చేసింది. అయినా తృణమూల్ వ్యతిరేక ఓట్ల చీలిక నివారించేందుకు బిజెపియేతర పార్టీల మధ్య పోటీల నివారణ వంటివి జరుగుతాయని అంటున్నారు గాని అవి ఆచరణలో చూడవలసిందే. ఇప్పుడు మమతా బెనర్జీ సిపిఎం కాంగ్రెస్ బిజెపి ఒకటేనన్నట్టు మాట్లాడుతున్నారు. తాను కేరళ వెళ్లి కాంగ్రెెస్ సిపిఎం ఒకటేనని ప్రచారం చేస్తానని ప్రకటించారు. అంటే బిజెపికి అనుకూలమైన పాత్ర నిర్వహిస్తారన్నమాట. ఎన్నికల తేదీలు కూడా ఆమెకు ఈ అవకాశం ఇచ్చేలా వున్నాయి గనక దీదీ మార్కు రాజకీయం ఎలాగూ జరుగుతుంది. పశ్చిమ బెంగాల్ ప్రభావం కేరళపై ఏ మాత్రం వుండబోదని ఇక్కడ బలాబలాల పొందికే వేరని అచ్యుతానందన్ గతంలోనే ప్రకటించి వున్నారు. అసలు బెంగాల్లోనే మమత మెజార్టి తెచ్చుకోవడానికి చాలా పెనుగులాడవలసి వుంటుందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. సిఓటరు సంస్థ నిర్వహించిన సర్వేలో టిఎంసికి 153 స్థానాలు మాత్రమే రావడం గమనార్హం. వామపక్షాలు ఇంకా దెబ్బతింటాయని కొందరు జోస్యాలు చెబుతున్నారు. బిజెపి పరోక్షంగా మమతకే సహకరిస్తుంది. వారికి వామపక్ష ప్రభుత్వం రాకుండా చేయడమే ఫ్రధానం. ఇన్నిటి మధ్యనా రేపు బెంగాల్లో ఏం జరుగుతుందనేది దేశమంతటా ఉత్కంఠ రేపుతున్న విషయం.
పశ్చిమ బెంగాల్లో మొత్తం 294 స్థానాలుంటే గతసారి టిఎంసి 184, కాంగ్రెస్ 42, సిపిఎం 40, ఫార్వర్డ్ బ్లాక్ 11, ఆర్ఎస్పి 7, గోర్ఖా జనముక్తి మోర్చా 3, సిపిఐ 2, ఇండి 2, ఇతరులు 3 తెచ్చుకున్నాయి.