తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుపై అభ్యంతరాలు, వివాదాలు కొనసాగుతున్నాయి. కరీంనగర్ జిల్లాలో జరుగుతున్న పరిణామాలపై న్యాయపోరాటం మొదలైంది. సిరిసిల్లకు చెందిన ఓ న్యాయవాది హైకోర్టును ఆశ్రయించారు. కొన్ని అభ్యంతరాలను కోర్టు ముందుంచారు.
పిటిషనర్ వాదన ప్రకారం, కొత్త జిల్లాల ఏర్పాటు ప్రాథమిక ప్రకటన జారీ చేసి సలహాలు, అభ్యంతరాలను స్వీకరించాలి. వీటికి సంబంధించిన మోడల్ డాక్యుమెంట్లను జిల్లా, రాష్ట్ర గెజిట్లలో ప్రచురించాలి. గ్రామ కూడలి, పంచాయతీ, ఆర్డీవో కార్యాలయాల్లో వీటిని అందుబాటులో ఉంచాలి. కానీ అలా చేయడం లేదు. ఇల్లంత కుంట మండలాన్ని సిద్దిపేట జిల్లాలో కలుపుతున్నారని పేర్కొన్నారు. ఈ మండలాన్ని కలిపి సిరిసిల్ల జిల్లా ఏర్పాటు చేయాలని ప్రజలుకోరుతున్నట్టు పిటిషనర్ వివరించారు.
పిటిషన్ ను స్వీకరించిన హైకోర్టు, కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభత్వం నిబంధనల మేరకే నిర్ణయాలను తీసుకోవాలని తేల్చి చెప్పింది. జిల్లాల ఏర్పాటు ప్రక్రియ తమ తుది ఉత్తర్వులకు లోబడే ఉంటుందని స్పష్టం చేసింది. జిల్లాల విభజనకు సంబంధించిన అభ్యంతరాల్లో ఇది బహుశా తొలి కీలక పరిణామం. తమ అభ్యంతరాలను అధికారులు గానీ ప్రభుత్వం గానీ పట్టించుకోవడం లేదని భావించే వారికి న్యాయపోరాటం ఒక మార్గంగా కనిపించ వచ్చు.
ప్రభుత్వం ఇప్పుడు మరింత జాగరూకతతో ఈ ప్రక్రియకు సంబంధించిన ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుంది. ప్రజల అభ్యంతరాలను పట్టించుకోలేదనే మాట రాకుండా అన్ని అంశాలను పరిగణన లోకి తీసుకోవాలనే అభిప్రాయం వినిపిస్తోంది. 10 జిల్లాల స్థానంలో 27 జిల్లాల ఏర్పాటు అంటే పరిపాలన పరంగా భారీ మార్పు. జిల్లాల సంఖ్యను ఒకేసారి సుమారు మూడు రెట్లు పెంచడం దేశం మొత్తం మీద చాలా అరుదైన విషయమే.
దసరా దగ్గర పడింది. వారం పదిరోజుల పాటు భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రం సతమతం అయింది. ఇప్పుడు వాన కొంత తెరిపినిచ్చింది. మళ్లీ ఆందోళనలు మొదలు కావచ్చు. సిరిసిల్లలో ఇప్పటికే పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. జిల్లా సాధనకు పోరాడుతున్న ఓ నాయకుడి ఇంటిపై దాడి జరిగింది. న్యాయపరంగా అంతా పక్కాగా ఉంటే కొత్త జిల్లాల ప్రక్రియక దసరా నుంచే అమల్లోకి రావచ్చు. ప్రజల అభ్యంతరాలను పట్టించుకోక పోవడం, నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోవడం వంటివి జరిగితే అప్పడు ఏమవుతుందో చూడాలి.