పవన్ కల్యాణ్ సర్దార్ – గబ్బర్ సింగ్‌గా సిద్ధమవుతున్నాడు. ఏప్రిల్ 8న ఈ సినిమాని విడుదల చేయాలన్న ఏకైక లక్ష్యంతో పవన్ బృందం అహర్నిశలూ కష్టపడుతోంది.రాత్రీ పగలూ అనే తేడా లేకుండా పనిచేస్తోంది. అయితే.. సర్దార్ ఏకాగ్రతకు భంగం కలిగిస్తూ ఇప్పుడు సర్దార్ చుట్టూ ఓ కొత్త సమస్య అల్లుకొంటోంది. సర్దార్ సినిమాని హిందీలో విడుదల కాకుండా ఆపాలని బాలీవుడ్ నిర్మాత అర్బాస్ ఖాన్ తెగ ప్రయత్నిస్తున్నాడు.
దానికి సంబంధించి లీగల్ నోటీసులు కూడా పంపించాడు. గబ్బర్ సింగ్ అనే పాత్ర పేరు షోలేలో ప్రతినాయకుడికి పెట్టిన పేరని, దాన్ని టైటిల్‌గా ఎలా వాడుకొంటారన్నది అర్భాస్ ప్రశ్న. ఇది వరకు గబ్బర్ సింగ్ సినిమా విడుదలకు ముందు కూడా అర్బాస్ ఇలానే ఆర్భాటం చేశాడు. అప్పుడు ఆ టైటిల్ వాడుకొన్నందుకు ఏకంగా రూ.25 లక్షలు నష్టపరిహారం చెల్లించి సమస్యని సెటిల్ చేసుకొన్నారు. మళ్లీ అలాంటి గొడవలేం రాకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే టైటిల్ ముందు సర్దార్ అని జోడించాడు పవన్. అయినా సరే.. ఆ టైటిల్ పై పూర్తి హక్కులు మావే.. అంటూ అర్బాస్ ఖాన్.. ఈ సినిమాని ఆపాలని, కనీసం ఎంతో కొంత గుంజాలని చూస్తున్నాడు. మరి.. ఈ సమస్య నుంచి సర్దార్ ఎప్పుడు ఎలా బయటపడతాడో చూడాలి.