హైకోర్టు ఇచ్చిన తీర్పుల విషయంలో న్యాయమూర్తులపై మీడియాలో.. సోషల్ మీడియాలో విపరీత వ్యాఖ్యలు చేస్తున్న వారి వ్యవహారాన్ని హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. బాపట్ల ఎంపీ నందిగం సురేష్, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి సహా 49 మందికి నోటీసులు జారీ చేసింది. నందిగం సురేష్తో పాటు ఆమంచి కృష్ణమోహన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను న్యాయమూర్తులు పరిశీలించారు. తదుపరి విచారణను 3 వారాలు వాయిదా వేశారు. డాక్టర్ సుధాకర్ కేసును సీబీఐకి అప్పగిస్తూ.. హైకోర్టు ధర్మానసం తీర్పు చెప్పిన తర్వాత.. న్యాయమూర్తులపై వైసీపీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
బాపట్ల ఎంపీ నందిగం సురేష్.. నేరుగా.. వైసీపీ కార్యాలయంలోనే ప్రెస్మీట్ పెట్టి… హైకోర్టును… మ్యానేజ్ చేస్తున్నారని ఆరోపించారు. తీర్పులు ప్రతిపక్ష నేత చంద్రబాబుకు తెలుస్తున్నాయని.. చంద్రబాబు కాల్ లిస్ట్ పై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. నందిగం సురేష్ వ్యాఖ్యలు రాజకీయవర్గాలతో పాటు… న్యాయవర్గాల్లోనూ కలకలం రేపాయి. అదే సమయంలో.. చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్… హైకోర్టు తీర్పుపై .. లాక్ డౌన్ లేకపోతే ధర్నాలు చేసేవారమని చెప్పుకొచ్చారు. జడ్జిలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వీటన్నింటి వీడియోలు.. సోషల్ మీడియా పోస్టులు… హైకోర్టుకు చేరాయి.
ఇక వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వ్యతిరేక పోస్టులు పెట్టారు. న్యాయమూర్తులను అసభ్యంగా తిడుతూ.. కులతత్వాన్ని అంటగడతూ… విమర్శలు చేశారు. ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తే సరే.. లేకపోతే.. మాత్రం.. కోర్టులను మేనేజ్ చేశారని.. ఇతర పార్టీల నేతలతో లింక్ పెట్టడమో.. కుల తత్వాన్ని అంటగట్టడమో చేయడం ద్వారా …న్యాయవ్యవస్థ విశ్వసనీయతను ప్రశ్నించే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో పెరిగిపోయిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. చట్ట ప్రకారం.. రాజ్యాంగం ప్రకారం..తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా.. న్యాయస్థానాలు ప్రశ్నించకూడదన్న రీతిలో బ్లాక్ మెయిల్ చేస్తున్నారని… ఇలా.. ఉద్దేశాలు ఆపాదించి ప్రచారం చేస్తూ.. ఓ రకంగా బ్లాక్మెయిల్ చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న హైకోర్టు… వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారికి నోటీసులు జారీ చేసింది.