ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రంగా పేరుబడిన కోహినూర్ ను ఇంగ్లండ్ నుంచి తిరిగి భారతదేశానికి తీసుకొచ్చేందుకు మరోసారి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. బాలీవుడ్ నటులు, వ్యాపారవేత్తలు కలసికట్టుగా `మౌంటెన్ ఆఫ్ లైట్’ పేరిట ఒక గ్రూప్ గా ఏర్పడి, ఈ అపూర్వ వజ్రాన్ని ఇంగ్లండ్ నుంచి తిరిగి స్వదేశానికి రప్పించేందుకు లండన్ హైకోర్టులో న్యాయపోరాటం ప్రారంభించబోతున్నారు. తమనుంచి తీసుకున్న కోహినూర్ వజ్రాన్ని తిరిగి ఇండియాకు అప్పగించాలని కోరుతూ క్వీన్ ఎలిజబెత్-2పై కోర్టులో దావా వేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కోహినూర్ వజ్రాన్ని మౌంటెన్ ఆఫ్ లైట్ (కాంతి శిఖరం) అని పిలిచేవారు. అదే పేరుతో వ్యాపారవేత్తలు, నటులు ఒక బృందంగాఏర్పడి ఇప్పుడు న్యాయపోరాటానికి దిగారు.
బ్రిటీష్ గవర్నర్ లార్డ్ డల్హౌసీ ద్వారా 1913లో కోహినూర్ వజ్రం విక్టోరియా రాణికి బహుమతిగా వెళ్ళింది. అప్పటి నుంచి ఇది లండన్ లోనే ఉండిపోయింది. ప్రస్తుతం దీన్ని లండన్ లోని ఓ మ్యూజియంలో భద్రపరిచారు. ఈ వజ్రాన్ని తిరిగి ఇవ్వాల్సిందిగా చాలాకాలం నుంచి భారతప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూనేఉంది. కాగా, ఇప్పుడు మరోమారు న్యాయపరమైన పోరాటం మొదలైంది.
కోహినూర్ – శమంతకమణి
కోహినూర్ వజ్రానికి 800 సంవత్సరాల చరిత్రఉంది. అనేక రాజవంశస్థుల చేతులుమారింది. బ్రిటీష్ వలసపాలనలో విక్టోరియా రాణి దగ్గరకు చేరింది. ఇది గుంటూరు జిల్లా కొల్లూరు గనుల్లో దొరికింది. తర్వాత కాకతీయుల సామాజ్యానికి, అటు తర్వాత ఢిల్లీ సుల్తానుల చేతుల్లోపడింది. అక్కడినుంచి చేతులు మారుతూ చివరకు లండన్ కు వెళ్లింది. విక్టోరియా మహారాణి చేతుల్లోకి వెళ్ళాక వజ్రానికి మరోసారి సానబట్టారు. అయితే, సానబడితే దాని కాంతి పెరగకపోగా నాణ్యత 186 క్యారెట్ల నుంచి 109 క్యారెట్లకు తగ్గిందట. ఆ తర్వాత క్వీన్ ఈ వజ్రాన్ని తన కిరీటంలో పొదిగించుకున్నారు. తన భర్త ఆరవ జార్జ్ రాజుగా పట్టాభిషిక్తుడవుతున్నప్పుడు మహారాణి ఈ వజ్రం పొదిగిన కిరీటాన్ని ధరించారు. ఆ తర్వాత 1953లో క్వీన్ ఎలిజబెత్ పట్టాభిషేకమహోత్సవంలో కూడా కొహినూర్ వజ్రం పొదిగిన కిరీటాన్ని ధరించారు. ప్రస్తుతం ఈ వజ్రం 105 క్యారెట్ల నాణ్యతతో ఉంది. కోహినూర్ వజ్రమే పురాణాల్లో చెప్పే శమంతకమణి అని మనవాళ్లు విశ్వసిస్తుంటారు. శమంతకమణి కూడా అనేకమంది చేతులు మారింది. దీని గురించి యుద్ధాలు జరిగాయి.
దోచుకున్నది ఇచ్చేయాల్సిందే…
బ్రిటీష్ వాళ్లు భారతదేశంలోని విలువైన సంపదలను దోచుకున్నారనీ, వాటిలో కోహినూర్ వజ్రం కూడా ఒకటని ఈ సంపదను తిరిగి ఇండియాకు ఇచ్చేయాలంటూ మనవాళ్లు న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. దావా వేయాలనుకుంటున్నవారిలో బాలీవుడ్ నటి భూమికా సింగ్ కూడా ఉన్నారు. కోహినూర్ కేవలం విలువైన వజ్రంమాత్రమేకాదు, ఈ వజ్రంలో దేశ చరిత్ర, సంస్కృతి ఇమిడి ఉన్నాయని భూమిక అంటున్నారు. హోలోకాస్ట్ యాక్ట్ ప్రకారం తాము కేసు నడింపించబోతున్నట్లు మౌంటెన్ ఆఫ్ లైట్ గ్రూప్ సభ్యులు చెబుతున్నారు. భారతీయ సంపదను అక్రమంగా తరలించారనీ, కోహినూర్ వజ్రం దొంగిలించబడిందనే తాము వాదించబోతున్నట్లు చెబుతున్నారు. తమకు న్యాయం జరగడంకోసం అంతర్జాతీయ న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయిస్తామని అంటున్నారు మన కోహినూర్ లాగానే బ్రిటీష్ మ్యూజియంలో ఉన్న ఎల్గిన్ మార్బల్స్ ప్రాచీన ఆకృతులను తిరిగి ఇచ్చేయమని గ్రీస్ అడుగుతోంది.
కోహినూర్ వజ్రం విషయంలో చాలాకాలంగా ఒక నమ్మకం ప్రచారంలోఉంది. దీన్ని స్త్రీలు ధరిస్తే వారు మహాశక్తిమంతులవుతారు. అదే పురుషులు ధరిస్తే మాత్రం వారికి అరిష్టం తప్పదు. చరిత్రపుటలు తిరగేస్తే ఇది నిజమేననిపించకమానదు. ఎంతో ఘనచరిత్ర ఉన్న కోహినూర్ వజ్రాన్ని తిరిగి ఇవ్వాలని న్యాయపోరాటం చేయాలని ఈ బృందం ప్రయత్నిస్తున్నప్పటికీ, ఈ తరహా వాదనలను యు.కె ప్రభుత్వం కొట్టిపారేస్తోంది. ప్రస్తుత మార్కెట్ లో ఈ వజ్రం విలువ పది కోటి పౌండ్లు పైమాటే.
కోహినూర్ వజ్రాన్ని తిరిగి రప్పించుకోవడం కోసం చేస్తున్న ఈ న్యాయపోరాటం ఫలిస్తే అంతకంటే సంతోషించే విషయం భారతీయులకు మరొకటి ఉండదేమో…
– కణ్వస