భారతీయ సంగీత ప్రపంచానికి మరో చేదు వార్త. ఎన్నో విజయవంతమైన చిత్రాలకు సంగీత దర్శకుడిగా పనిచేసిన బప్పీలహరి కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన వయసు 69 ఏళ్లు.
సంగీత దర్శకుల్లో బప్పీలహరి స్టైల్ ప్రత్యేకం. డిస్కో, బీట్ తరహా పాటలకు ఆయన ప్రసిద్ధి. ఆ పాటలే.. బప్పీలహరికి ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చాయి. హిందీనాట విజయవంతమైన చిత్రాలకు పనిచేసిన బప్పీలహరి… తెలుగులోనూ కొన్ని సూపర్ హిట్లు కొట్టారు. ముఖ్యంగా `గ్యాంగ్ లీడర్`… అప్పట్లో ఓ ఊపు ఊపేసింది. అందులో అన్ని పాటలూ సూపర్ హిట్టే. ఓ కొత్త సౌండింగ్, రిథమ్, బీట్.. ఆ పాటల్లో కనిపించాయి. సింహాసనం, బ్రహ్మ, స్టేట్ రౌడీ, రౌడీ ఇనస్పెక్టర్, నిప్పురవ్వ.. ఇవన్నీ ఆయన సినిమాలే. స్టేట్ రౌడీలో… చుక్కల పల్లకిలో.. మంచి మెలోడీ. ఎంత ఫాస్ట్ బీట్ పాటలకు పేరొందినా, ఆయన మెలోడీ వదల్లేదు. సినిమాలో ఆరు పాటలు ఉంటే, కచ్చితంగా అందులో ఓ పాట మెలోడీ ఉండాల్సిందే. కొత్త గాయకుల్ని పరిచయం చేసి, వాళ్లను పాపులర్ చేసిన ఘనత కూడా బప్పీలహరిదే. ఆయన అసలు పేరు అలోకేష్ లహరి. బెంగాల్ లో పుట్టారు. తల్లిదండ్రులిద్దరూ గాయకులే. కిషోర్ కుమార్ దగ్గరి బంధువు. మూడేళ్ల వయసులోనే తబలా నేర్చుకున్న బప్పీలహరికి.. బంగారం అంటే ఇష్టం. `గోల్డ్ ఈజ్ మై గాడ్` అంటుండేవారాయన. ఆయన మెడలో ఎప్పుడూ బంగారు ఆభరణాలు మెరుస్తూ ఉండేవి.