హైడ్రా విషయంలో రేవంత్ రెడ్డి ఎంత సీరియస్ గా ఉన్నారో మరోసారి నిరూపితమయింది. చట్టబద్ధత కోసం అవసరమైన నిర్ణయాన్ని కేబినెట్ లో తీసుకున్నారు. అసెంబ్లీలో ఆమోదిస్తే ఇక హైడ్రాకు తిరుగులేనట్లే. ఈ లోపు ఆర్డినెన్స్ కూడా జారీ చేయవచ్చు. ప్రత్యేక పోలీస్ స్టేషన్, పోలీసులు కూడా హైడ్రాకు ఉంటారు. కొత్తగా ట్రైబ్యూనల్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు. హైడ్రాకు చట్టబద్ధతపై కోర్టులో వరుస పిటీషన్లు దాఖలవుతున్నందున.. న్యాయపరమైన చిక్కులు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
హైడ్రాను ఏర్పాటు చేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం జారీ చేసిన జీవో 99ను చాలా మంది కోర్టులో ఛాలెంజ్ చేస్తున్నారు. నిర్మాణాల కూల్చివేత సందర్భంగా హైకోర్టులో పెద్ద ఎత్తున పిటీషన్లు దాఖలవుతున్నాయి. కార్యనిర్వాహక ఆదేశాలు సరిపోవని.. అసెంబ్లీలో చట్టం తేవాలని నిపుణులు కూడా సూచిస్తున్నారు. దీంతో హైడ్రాకు చట్టబద్దత కల్పించే ఆర్డినెన్స్ తీసుకువచ్చి సూపర్ పవర్స్ కల్పించే క్రమంలో ప్రత్యేకంగా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైకోర్టు పై భారాన్ని తగ్గించేందుకు ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం ఉత్తమమన్న న్యాయ నిపుణుల సూచనను మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
హైడ్రాకు సంబంధించిన వివాదాల్లో ఒకవేళ ట్రైబ్యునల్ తీర్పుపై అభ్యంతరాలున్న పక్షంలో హైకోర్టుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది, సాధారణంగా ట్రైబ్యూనల్స్ కు హైకోర్టు రిటైర్డ్ జడ్జీలు చైర్మన్లుగా వ్యవహరిస్తారు. ఇప్పటికే తెలంగాణ రెరా, దేవాదాయ శాఖలకు ట్రిబ్యునళ్ల ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లో హైడ్రా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తేనే.. నిర్మాణాలు చేపట్టేలా ఆ సంస్థకు అధికారాలు కట్టబెట్టనున్నారు. త్వరలో తెలంగాణ భూ ఆక్రమణ చట్టం-1905 ఆర్డినెన్స్-2024 తీసుకు వచ్చే అవకాశం ఉంది. వివిధ శాఖలకు చట్టపరంగా దఖలు పడిన కొన్ని అధికారాలను తొలగించి హైడ్రాకు బదిలీ చేసేలా ఆర్డినెన్స్‌లో ఉంటుంది.
ఆక్రమణదారులకు నేరుగా నోటీసులివ్వడం నుంచి కూల్చివేతలు, కబ్జా చేసిన స్థలాల స్వాదీనం వరకు హైడ్రా కు అడ్డంకులు ఉండవు. కోర్టుల్లో కేసులు వేసినా చట్టబద్దత ఉంటుంది కాబట్టి పెద్దగా చిక్కులు రావు.