Leo Movie Review
తెలుగు360 రేటింగ్ : 2.25/5
కేవలం మూడు సినిమాలతోనే తనకంటూ ఒక సినిమాటిక్ యూనివర్స్ ని క్రియేట్ చేసుకున్న దర్శకుడు లోకేష్ కనకరాజ్. ‘లియో’ పై ఈ స్థాయిలో అంచనాలు పెరగడానికి లోకేష్ ఒక ప్రధాన కారణం. ‘మాస్టర్’ సినిమాతో విజయాన్ని అందుకున్న విజయ్, లోకేష్.. మరోసారి కలసి సినిమా చేస్తున్నారనే ప్రకటన రావడంతోనే చాలా హైప్ నెలకొంది. విడుదల దగ్గర పడుతున్న కొద్ది ఆ అంచనాలు మరింతగా పెరిగాయి. మరి ఇన్ని అంచనాలతో వచ్చిన ‘లియో’ ప్రేక్షకులుని ఏ మేరకు అలరించింది ? లోకేష్ సినిమాటిక్ యూనివవర్స్ లో లియో భాగమా కాదా ? విక్రమ్ తో పాన్ ఇండియా మ్యాజిక్ చేసిన లోకేష్ మళ్ళీ అలాంటి మ్యాజిక్ క్రియేట్ చేశాడా ?
పార్తిబన్ అలియాస్ పార్తి (విజయ్ )తన కుటుంబంతో హిమాచల్ ప్రదేశ్‌లో స్థిరపడతాడు. అక్కడే కేఫ్ నడుపుకొంటూ భార్య సత్య( త్రిష) ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తుంటాడు. పార్తి ఫ్యామిలీ మ్యాన్ టైపు. ఎలాంటి గొడవలకి వెళ్ళకుండా కుటుంబమే తన ప్రపంచం అని బ్రతుకుతుంటాడు. అలాగే దారితప్పిన వన్యప్రాణులని పట్టించడంలో పోలీసులకి సహాయపడుతుంటాడు. హాయిగా గడిచిపోతున్న పార్తి జీవితంలోకి ఓ క్రిమినల్ ముఠా ప్రవేశిస్తుంది. ఓ రాత్రి తన కేఫ్‌లో చొరబడిన ఆ ముఠాని ఆత్మరక్షణలో భాగంగా చంపేస్తాడు పార్తి. ఆత్మరక్షణలో భాగంగా ఆ ముఠాని చంపినట్లు గుర్తించిన కోర్టు కూడా పార్థిని నిర్దోషిగా విడుదల చేస్తుంది. ఐతే ఈ సంఘట పత్రికల్లో వస్తుంది. పార్తి ఫోటోని చూసిన ఆంటోని దాస్ (సంజయ్ దత్) తన గ్యాంగ్ తో పార్తిని వెతుక్కొంటూ హిమాచల్‌ప్రదేశ్‌కు వస్తాడు. దీనికి కారణం పార్తి .. అంటోనీ కొడుకు లియో దాస్ పోలికలతో వుండటం. అంటోనీ దాస్, పార్తిని కలుసుకున్న తర్వాత ఎలాంటి సంఘనలు చోటు చేసుకున్నాయి ? అసలు లియో దాస్ ఎవరు ? అతడి గతం ఏమిటి ?లియో దాస్, పార్తి ఒక్కరా కాదా ? అనేది తక్కిన కథ.
కొత్తకథలు పుట్టవు. వున్న కథనే కొత్తగా చెప్పాలి. లోకేష్ కనకరాజ్ లియో కోసం ఇదే దారిని ఎంచుకున్నాడు. కథ చూస్తే లియోలో పెద్ద కొత్తదనం వుండదు. అప్పుడెప్పుడో వచ్చిన బాషా తరహా కథ ఇది. అయితే దీనికి చిన్న తేడా వుంది. కథానాయకుడికి గతం వుంటుంది కానీ ఆ గతంలోకి మళ్ళీ వెళ్లాలని వుండదు. ఆ తేడా తప్పితే లియో టెంప్లెట్ పాత తరహాదే. అయితే ఈ తేడాని చూపించడంలో కూడా ఓ హాలీవుడ్ సినిమా స్ఫూర్తిని ఎంచుకున్నాడు దర్శకుడు. హిస్టరీ అఫ్ వైలెన్స్ సినిమా స్ఫూర్తి ఇందులో వుందని టైటిల్ లోనే చెప్పాడు. సన్నివేశాలని యధాతధంగా తీసుకోలేదు కానీ ఇందులో చాలా వరకూ కథనం నడిపిన తీరు హిస్టరీ అఫ్ వైలెన్స్ లానే వుంటుంది.
ఫ్యామిలీ మ్యాన్ లా వుండే హీరో.. ఓ ముఠా కారణంగా అరెస్ట్ కావాల్సివస్తుంది. ఆ క్రమంలో వచ్చే కాఫీ షాప్ ఫైట్ సీన్,అంతకుముందు హైనాతో చేసిన యాక్షన్ చక్కగానే డిజైన్ చేశారు. పార్తిబన్ కోర్టు నుంచి విడుదలైన తర్వాత తన ఫ్యామిలీ రక్షణ కోసం చేసుకునే ఏర్పాట్లు కాస్త నిదానంగానే వుంటాయి. తనకి పోలీస్ రక్షణ కావాలని స్టేషన్ లో గొడవపడి పోలీస్ పీక పట్టుకున్న సీన్ కొంచెం అతి అనిపిస్తుంది. కోర్టు ఆర్డర్ తో ఖైదీలోని నెపోలియన్ పాత్రని ప్రవేశపెడతారు. ఇది లోకేష్ యూనివర్స్ అనుకోవాలి. హీరో పై చేసే హత్య ప్రయత్నం దాన్ని తిప్పికొట్టడం రొటీన్ గానే వుంటాయి. అయితే అంటోనీ దాస్ గా సంజయ్ దత్ ని పరిచయం చేస్తూ వేసిన విరామఘట్టం కూడా ఓకే అనిపిస్తుంది. అయితే అప్పటివరకూ ఎన్నో అంచనాలు పెట్టుకొని సినిమాకి వెళ్ళిన ప్రేక్షకుడికి మాత్రం ఈ సెటప్ అంత కిక్ ఇచ్చినట్లు వుండదు.
ఫస్ట్ హాఫ్ మరీ గొప్పగా కాకపోయినా ఎదో నడిపించారనే ఫీలింగ్ కలుగుతుంది కానీ సెకండ్ హాఫ్ కి వచ్చేరికి మాత్రం ట్రాక్ తప్పుతుంది. ‘ నువ్వే లియో.. ఒప్పుకో’ అని అంటోనీ అనడం, ”నేను లియో కాదు’ అని పార్థి మొత్తుకోవడం.. దీనితోనే సరిపోయింది. ఎంతో ఘనంగా ఉంటుదని భావించిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా తేలిపోయింది. పైగా అంటోనీ దాస్ కి ఇచ్చిన ఆ నరబలి క్యారెక్టర్ ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాలో ఇమడలేదు. అటు అర్జున్ పాత్ర, ఇటు సంజయ్ పాత్ర ఏదీ బలంగా వుండదు. క్లైమాక్స్ లో ఓ కార్ చేజ్, పార్తి ఇంట్లో పెట్టిన యాక్షన్ సీన్, అర్జున్ తో చేసే ఫైట్. వరుసగా వస్తాయి. ఐతే అవి పూర్తిగా సాగదీతగా సాగుతాయి.
ఇందులో విజయ్ ది వన్ మ్యాన్ షో అని చెప్పాలి. లోకేష్ మిగతా హీరోలతో చేసినప్పుడు కథని అన్ని వైపులా నడుపుతాడు కానీ విజయ్ దగ్గరకి వచ్చినపుడు ఆయన పాత్రే సెంటర్ అఫ్ ఎట్రాక్షన్ గా వుంటుంది. మాస్టర్ తో పోల్చుకుంటే లియోలో అది ఇంకాస్త ఎక్కువైయింది. ప్రతి సీన్ లో విజయ్ ఉంటాడు. ఇంలాంటి పాత్ర విజయ్ కి కొత్తకాదు. ఈజీగానే చేసుకుంటూ వెళ్ళాడు. అయితే ఎమోషనల్ సీన్స్ లో మాత్రం చాలా వరకూ మొహం కప్పేసే బాధపడినట్లుగా వుంటుంది. త్రిష హుందాగా కనిపించింది. సంజయ్ దత్, అర్జున్ పాత్రల్లో బలం లేదు. వాళ్ళ ప్రజన్స్ ని కూడా సరిగ్గా వాడుకోలేకపోయారు. గౌతమ్ మీనన్ తో సహా మిగతా పాత్రలు పరిధిమేర వున్నాయి.
అనిరుద్ నేపధ్య సంగీతం ఒక ఆకర్షణ. యాక్షన్ సీన్స్ ని బాగాఎలివేట్ చేశాడు. అయితే విక్రమ్ తో పోల్చుకుంటే ఇందులో గుర్తుండిపోయే స్కోర్స్ వుండవు. మనోజ్ పరమహంస కెమరాపనితనం బావుంది. లోకేష్ సినిమాలు డార్క్ లో వుంటాయి. ఇందులో మాత్రం హిమాచల్ ప్రదేశ్ చుట్టూ కెమరా కూల్ గా తిరిగింది. ఎడిటింగ్ సెకండ్ హాఫ్ లో బెటర్ గా వుండాల్సింది. నిర్మాణ విలువలు డీసెంట్ గా వున్నాయి. మాటలపై శ్రద్ధ పెట్టలేదు. గుర్తుపెట్టుకునే మాటలు లేవు. లోకేష్ సినిమాల్లో కథ యంగేజింగ్ ఉంటూ తర్వాత ఏం జరుగుతుందో అనే ఆసక్తి వుంటుంది. ఇందులో మాత్రం అలాంటి ఆసక్తికనిపించదు. చివర్లో కమల్ హాసన్ వాయిస్ వినిపించి దీన్ని లోకేష్ యూనివర్స్ భాగం చేయాలని అందుకున్నారు కానీ అది అంత ప్రభావంతగా కుదరలేదు. ఈ సినిమా విడుదలకు ముందు చాలా అంచనాలు నెలకొన్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా సినిమా చూసినా నిరాశ పరిచే కంటెంట్ ఇది.
తెలుగు360 రేటింగ్ : 2.25/5