ఇన్ఫోసిస్ ఆఫీస్ క్యాంపస్ లోకి పులి వచ్చినట్లుగా తెలియడంతో అందరికీ వర్క్ ఫ్రం హోం ఇచ్చేశారు. ఎవరూ పొరపాటున కూడా ఆఫీసుకు రావొద్దని అర్జంట్ మెయిల్ పంపారు. ఈ మెయిల్స్ చూసుకోకుండా ఎవరైనా ఆఫీసు దగ్గరకు వస్తే వెనక్కు పంపేస్తున్నారు. మైసూర్‌లోని ఇన్ఫోసిస్ క్యాంపస్ లో పని చేసే వారికి ఈ అనుభవం ఎదురయింది.
ఇన్ఫోసిస్ వర్క్ ఫ్రం హోంకు పూర్తి వ్యతిరేకం. అయినా పులి కారణంగా వర్క్ ఫ్రం హోం ఇవ్వక తప్పలేదు. మైసూరులోని ఇన్ఫోసిస్ క్యాంపస్ రిజర్వ్ ఫారెస్టుకు సమీపంలో ఉంటుంది. ఫారెస్ట్ నుంచి ఓ పులి క్యాంపస్ లోకి వచ్చేసింది. దాన్ని గమనించడంతో వెంటనే అలర్ట్ అయ్యారు. ఫారెస్ట్ సిబ్బందికి ఇతర అధికారులకు సమాచారం ఇచ్చి పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ దొరకలేదు. అందుకే వర్క్ ఫ్రం హోం ఇచ్చేశారు.
రెండు మూడు రోజులుగా తిరుగుతోంది కానీ పట్టుకోలేకపోతున్నారు. పట్టుకునే వరకూ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేయనున్నారు. మళ్లీ చెప్పే వరకూ ఆఫీసుకు వెళ్లేందుకు ఉద్యోగులు కూడా భయపడే అవకాశం ఉంది. 2011లో కూడా ఓ సారి ఇన్ఫోసిస్ మైసూర్ ఆఫీసులోకి పులి వచ్చింది. అప్పట్లో అందరూ పరుగులు తీశారు. ఎలాగోలా పట్టుకున్నారు. ఇప్పుడు ఈ పులి దొరుకుందో లేదో అన్న టెన్షన్ ఉద్యోగులకు పట్టుకుంది.
ఆఫీసులో పులి అనేది కొత్త కాన్సెప్ట్. ఈ ఐడియాతో సస్పెన్స్ ధ్రిల్లర్ సినిమా తీస్తే సూపర్ హిట్ అయిపోతుందేమో ?