అడవిలో నుంచి ఊళ్లోకి చిరుత వచ్చింది. ఎవరూ బయటకు రాకండి.. రాత్రిళ్లు అసలు బయటకు రాకండి అని చేసే ప్రకటనలు సినిమాల్లో వినిపిస్తూంటాయి. ఇప్పుడు రాజమండ్రిలో వినిపిస్తున్నాయి. ఓ చిరుత ఎక్కడి నుంచి వచ్చిందో కానీ రాజమండ్రి వాసులకు కంటి మీద కనుకు లేకుండా చేస్తోంది. మొదట చిరుపతి కాలి ముద్రు కనిపించాయి. తరవాత కొన్ని జీవుల్ని చంపి తింటోందని గుర్తించారు. అయితే అప్పటికీ అటవీ అధికారులకు డౌటే. అది చిరుత కాదని .. కానీ సీసీటీవీ ఫుటేజీలో .. పుష్ప స్టైల్ లో కనిపించడంతో ఇక నమ్మక తప్పలేదు.
ఆ చిరుత ఎటూ పోలేదని రాజమండ్రి చుట్టుపక్కలే తిరుగుతోందని గుర్తించారు. లాలాచెరువు, దివాన్ చెరువు తదితర ప్రాంత ప్రజలు తలుపు తీయాలంటే వణికిపోతున్నారు. నిఘా కెమెరాల్లో సైతం ప్రతిరోజు రికార్డవుతోంది కానీ పగలు మాత్రం కనిపించడం లేదు. రాత్రి సమయంలో లాలాచెరువు, హౌసింగ్ బోర్డు కాలనీల ప్రజలు ఆరుదాటితే జాగ్రత్తలు వహించాలని అధికారులు ప్రత్యేక అనౌన్స్ చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పులి కనిపిస్తే తెలియజేయాలని ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ప్రకటించాల్సి వచ్చింది.
చిరుతను బంధించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు . అది పగటి పూట ఎక్కడ తలదాచుకుంటుందో తెలిస్తే.. పట్టుకోవడానికి అవకాశం ఉంటుందని.. పాదముద్రలతో ప్రయత్నిస్తున్నారు . కానీ ఆ చిరుత మహా తెలివిగా ప్రవర్తిస్తూ తప్పించుకుంటోంది. ఇప్పటి వరకూ మనుషులు ఎవరికీ హాని చేయలేదు కానీ.. కొన్ని జీవుల్ని పట్టుకుని చంపి తింటోంది. ఆ చిరుతను పట్టుకునేవరకూ రాజమండ్రి వాసులు భయం భయంగా బతకాల్సిందే.