నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కసరత్తు కోసం బీఆర్ఎస్ చేపట్టిన సమావేశానికి పట్టు మని నలభై మంది నేతలు రాకపోవడం ఆ పార్టీ దుస్థితిని తెలియచేస్తోంది. బీజేపీ నుంచి వచ్చిన లీడర్ కు అభ్యర్థిత్వం ఇచ్చారని చెప్పి పార్టీ నేతలంతా కినుక వహించారు. ఎవరూ కేటీఆర్ నిర్వహించిన సన్నాహాక సమావేశానికి రాలేదు. అసలు కేటీఆర్ మాటనే పట్టించుకోవడం మానేశారు.
బీఆర్ఎస్ అభ్యర్థిగా రాకేష్ రెడ్డిని కేసీఆర్ ఖరారు చేశారు. బీజేపీ టిక్కెట్ రాకపోవడంతో ఆయన అసెంబ్లీ ఎన్నికల సమయమంలో బీఆర్ఎస్ లో చేరారు. రాకేశ్ రెడ్డికి టికెట్ ఇవ్వడాన్ని మాజీ మంత్రి ఎర్రబెల్లి సహా మెజార్టీ లీడర్లు వ్యతిరేకిస్తున్నారు. రాకేష్ రెడ్డిని గెలిపించే వ్యూహాన్ని ఖరారు చేయడానికి మూడు జిల్లాల నుంచి 130 మంది నాయకులకు ఆహ్వానం పంపారు. అయితే గట్టిగా నలభై మంది కూడా రాలేదు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్ల ధర్మారెడ్డి, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, బస్వారాజు సారయ్య, తక్కెళ్లపల్లి రవీంద్ రావుతో పాటు పలువురు కార్పొరేషన్ మాజీ చైర్మన్లు ఈ మీటింగ్ కు గైర్హాజరయ్యారు. రాకేశ్ రెడ్డికి మద్దతు ఇచ్చేది లేదని పలువురు బహిరంగంగానే చెబుతున్నారు.
బీఆర్ఎస్ కు ఓ రకంగా ఇది సిట్టింగ్ స్థానం. తమ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామా వల్ల వచ్చిన ఉపఎన్నిక. అందుకే గెలవడం మరింత ప్రతిష్టాత్మకం. కానీ ఇప్పుడు అభ్యర్థిని నిలపడంతోనే తడబడ్డారు. మరో వైపు కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ప్రత్యేక శైలితో ప్రచారం చేసుకుంటున్నారు ఆయనకు కాంగ్రెస్ నేతలు సహకరిస్తున్నారు. పార్లమెంట్ ఫలితాలకు ముందే పోలింగ్ జరుగుతుంది కాబట్టి… ఘోరమైన పరిస్థితులు ఉండవని రాకేష్ రెడ్డి ఆశలు పెట్టుకుంటున్నారు.