రాజకీయాలు వేరు, సినిమాలు వేరు అని జనాలు చెబుతుంటారు. కానీ అవి ఒకదానితో మరోటి తెలియకుండానే మిక్స్ అయిపోతుంటాయి. రాజకీయాలకు సినీ గ్లామర్ కావాలి, సినిమాల్లో రాజకీయాలు ఉండాలి. లేదంటే కిక్కే ఉండదు. సినిమాల్లో `వీడు ఫలానా పార్టీ వాడు` అని ముద్ర పడిపోతే ఎంత లాభం ఉంటుందో, అంతే నష్టం ఉంటుంది. ఆ పార్టీకి కావల్సినవాళ్లంతా వాళ్లని చేరదీస్తారు. పార్టీ కానివాళ్లంతా – దూరంగా ఉంచుతారు. గత ఎన్నికల్లో వైకాపాకి గట్టిగా సపోర్ట్ చేసిన కొంతమందికి ఇప్పుడు సినిమా అవకాశాలు తగ్గాయన్నది వాస్తవం. అలీ, ఫృథ్వీ, పోసానీలపై ఈ ఎఫెక్ట్ చాలా పడింది.
తెలుగు సినిమాలో పార్టీల పరంగా, కులల పరంగా చీలిక స్పష్టంగా కనిపిస్తుంటుంది. ఓ వర్గానికి చెందిన వ్యక్తుల ఆధిపత్యం టాలీవుడ్ లో ఎక్కువ. వాళ్లకు ఎదురెళ్తే క్లిష్ట పరిస్థితులు తప్పవు. ప్రస్తుతం అలీ, ఫృథ్వీ, పోసానిల విషయంలో అదే జరుగుతోంది. బ్రహ్మానందం తరవాత ఆ స్థాయిలో సినిమాలు చేసి, అభిమానుల్ని సంపాదించుకున్న హాస్య నటుడు అలీ. దాదాపు ప్రతీ సినిమాలోనూ తాను ఉంటాడు. పెద్ద సినిమాల్లో అయితే అలీ ఎంట్రీ తప్పనిసరి. పారితోషికం కూడా ఎక్కువే. రోజుకి రెండు మూడు కాల్షీట్లతో బిజీగా ఉండే అలీ ఇప్పుడు దాదాపుగా ఖాళీ అయ్యాడు. తన కెరీర్లో ఎప్పుడూ రానంత స్థబ్దత ఇప్పుడొచ్చింది. గత ఎన్నికల్లో ఏ పార్టీలో చేరాలో తెలియక చాలా కన్ఫ్యూజ్కి గురయ్యాడు అలీ. పార్టీలన్నీ తిరిగి తిరిగి చివరికి వైకాపా కండువా కప్పుకున్నాడు. దాంతో ప్రాణ స్నేహితులైన పవన్ – అలీకీ గ్యాప్ వచ్చినట్టైంది. చివరికి ఆయన నమ్ముకున్న జగనే అధికారంలోకి వచ్చారు. వైకాపాలో చేరినందుకు ఏదో ఓ పదవి వస్తుందని అలీ ఆశ. కానీ అది ఇప్పటి వరకూ అందలేదు. దాంతో పాటు సినిమా అవకాశాల్నీ కోల్పోవాల్సివస్తోంది. అలీ అంటే ఎవ్వరికీ శత్రుత్వం లేదు. కాకపోతే.. `వైకాపా` ముద్ర పడడం వల్ల టీడీపీ సానుభూతి పరులు అలీని దూరం పెడుతున్నారు. మెగా ఫ్యామిలీకి అలీ క్రమంగా దూరం అవుతున్నాడు. ఇండ్రస్ట్రీలో మెగా హీరోల ఆధిపత్యం ఎక్కువ. వాళ్ల సినిమాలెప్పుడూ రన్ అవుతూనే ఉంటాయి. ఆ అవకాశాలన్నీ అలీ కోల్పోయినట్టే.
సినిమా వాళ్ల తరపున ఈ ఎన్నికల్లో ఎక్కువగా మాట్లాడిన నటుడు పృథ్వీ. `నాకు సినిమాలే ముఖ్యం, రాజకీయాలు కూడా దాని తరవాతే` అని ఏ నటుడైనా అంటారు. కానీ ఫృథ్వీది పూర్తిగా రివర్స్ వ్యవహారం. అసలు సిసలైన రాజకీయ నాయకుడిగా అవతారం ఎత్తి – సినీ పరిశ్రమపై సైతం ఘాటైన విమర్శలు చేశాడు. దానికి తగిన ఫలితం కూడా పదవి రూపంలో వచ్చింది. కానీ సినిమాలకే దూరం కావల్సివచ్చింది. గత నాలుగేళ్లలో ఫృథ్వీ బిజీ కమెడియన్గా మారిపోయాడు. బడా సినిమాల్లో ఆఫర్లు సైతం వెదుక్కుంటూ వచ్చాయి. కానీ సడన్గా ఫృథ్వీ ఖాళీ అయిపోయాడు. దానికి కారణం.. వైకాపా ముద్రే. పోసాని పరిస్థితి కూడా ఇంచుమించుఇలానే ఉంది. ఆరోగ్యం బాగోలేక ఆయన కొన్ని అవకాశాల్ని వదులుకుంటే, కొంతమంది ఆయన్నివదులుకున్నారు. పైగా నవతరం కమెడియన్ల హావా ఇప్పుడు బాగా ఎక్కువైంది. అలీ ప్లేసులో వెన్నెల కిషోర్, ప్రియదర్శి వాళ్లు బాగా సెట్టయిపోతున్నారు. ఛాయిస్లు ఉన్నప్పుడు.. సీనియర్లు పక్కకు తప్పుకోవాల్సివస్తుంటుంది. ఈ ముగ్గురు కమెడియన్లకూ ఛాయిస్లు పెరిగాయి. కాబట్టి వీళ్లకు అవకాశాలు తగ్గాయి.
రాజకీయాల్లోనే కాదు.. చిత్రసీమలోనూ శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులూ ఉండరు. వీళ్ల క్యారెక్టర్ మరొక్కటి పేలితే – మళ్లీ ఆఫర్లు వరుస కడతాయి. అప్పుడు రాజకీయాలు గుర్తురావు. గ్రూపులూ గుర్తుకురావు. అలాంటి క్యారెక్టర్ కోసం వీళ్ల ఎదురు చూపులు మొదలయ్యాయి. మరి ఎప్పటికి నెరవేరతాయో చూడాలి.