టెస్టింగ్.. ట్రేసింగ్.. ట్రీటింగ్ అంటూ.. ప్రపంచం మొత్తం కరోనాపై పోరాటానికి దూకుడుగా వెళ్తూంటే.. తెలంగాణ మాత్రం.. వైరస్‌ను దాచి పెట్టుకుంటోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. టెస్టుల సంఖ్య అతి తక్కువగా చేయడమే దీనికి కారణం. కొద్ది రోజులుగా అసలు టెస్టులే నిలిపివేశారని.. హైకోర్టు సీరియస్ అయిన తర్వాతనే మళ్లీ టెస్టులు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దేశంలో.. అతి తక్కువగా కోవిడ్ టెస్టులు చేసిన రాష్ట్రం తెలంగాణనే. హైదరాబాద్ లాంటి మెట్రో సిటీ ఉండగా.. అంత తక్కువ టెస్టులు చేయడం ఏమిటన్న ఆశ్చర్యం అన్ని వర్గాల్లోనూ వ్యక్తమవుతోంది. తెలంగాణలో ఇప్పటి వరకూ చేసింది 22842 టెస్టులు మాత్రమే. అదే పొరుగున ఉన్న ఆంధ్రలో.. రోజుకు పది వేల వరకూ టెస్టులు చేస్తున్నారు.
భారత్ మొత్తం మీద ఇరవై లక్షల వరకూ కోవిడ్ టెస్టులు చేస్తే.. అందులో.. తెలంగాణ వాటా 20వేలకు కాస్త ఎక్కువ మాత్రమే. అంత తక్కువ టెస్టులు చేసినా పాజిటివ్ రేటు ఎక్కువగా ఉంది. టెస్టులు చేస్తున్న వారిలో 6.1 శాతం మందికి వైరస్ సోకినట్లుగా గుర్తిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇది 1.1 శాతంగా మాత్రమే ఉంది. దేశ సగటు నాలుగు మాత్రమే. ప్రభుత్వం టెస్టులు చేయకూడదనే ఓ విధాన నిర్ణయానికి వచ్చిందనే విమర్శలు వస్తున్నాయి. ఏప్రిల్ 29వ తేదీ నాటికి తెలంగాణలో దాదాపుగా 19వేల టెస్టులు చేశారు. ఆ తర్వాత మే 14వ తేదీకి ఆ సంఖ్య 22వేలు మాత్రమే. అంటే.. మధ్యలో కొన్నాళ్ల పాటు టెస్టులు నిలిపివేశారు. హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత మళ్లీ టెస్టులు ప్రారంభించారు. దీని వల్ల ఇప్పుడు కేసులు రోజుకు నలభై, యాభై వరకూ.. నమోదవుతున్నాయి. అయితే.. ఏ కేంద్ర సంస్థ కానీ.. కేంద్ర ప్రభుత్వం కానీ.. ఈ విషయంలో తెలంగాణ సర్కార్‌పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయలేదు.
జాతీయ మీడియా ప్రతినిధులు ఇదే అంశాల్ని ప్రస్తావిస్తూ.. సోషల్ మీడియాలో విమర్శలు చేయడంతో.. ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ అక్కడే సుదీర్ఘమైన సమాధానం ఇచ్చారు. తాము టెస్టులు నిలిపివేయలేదని.. ఐసీఎంఆర్ సూచనల మేరకు.. ప్రైమరీ, సెకండరీ, టెర్రిటరీ కాంటాక్ట్స్ అందరికీ పరీక్షలు చేస్తున్నామని స్పష్టం చేశారు. తక్కువ పాజిటివ్ కేసులు వస్తున్నాయంటే.. తక్కువ టెస్టులు చేయడం వల్ల కాదని ఆయన వాదించారు. ఇతర దేశాల్లో పాటిస్తున్న టెస్టింగ్ విధానాలను కూడా పోస్ట్ చేశారు. ప్రముఖ జర్నలిస్ట్ శేఖర్ గుప్తా.. తెలంగాణ కరోనా టెస్టుల ప్యాట్రన్‌ను ఓ నేషనల్ స్కాండల్‌గా చెప్పుకొచ్చారు. ఆర్టికల్ 370ని కశ్మీర్లో తీసేసి.. తెలంగాణలో పెట్టారా..? అని ఆశ్చర్యపోయారు.